PSL 2023: Jason Roy Quick Ton Powers Quetta Gladiators To Victory Over Peshawar Zalmi - Sakshi
Sakshi News home page

జేసన్‌ రాయ్‌ విధ్వంసకర శతకం.. టీ20ల్లో అతి భారీ లక్ష్యఛేదన రికార్డు

Published Thu, Mar 9 2023 8:50 AM | Last Updated on Thu, Mar 9 2023 9:01 AM

PSL 2023: Jason Roy Quick Ton Powers Quetta Gladiators To Victory Over Peshawar Zalmi - Sakshi

PSL 2023: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో పరుగుల ప్రవాహం పతాక స్థాయికి చేరింది. క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మీ జట్ల మధ్య నిన్న (మార్చి 8) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు విధ్వంసకర శతకాలతో రెచ్చిపోవడంతో భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు బద్దలయ్యాయి. టీ20 క్రికెట్‌ చరిత్రలో (ఆసియా పరిధిలో) అతి భారీ లక్ష్యఛేదన రికార్డు ఈ మ్యాచ్‌లోనే నమోదైంది.

పెషావర్‌ జల్మీ నిర్ధేశించిన 241 పరుగుల భారీ లక్ష్యాన్ని క్వెట్టా గ్లాడియేటర్స్‌ మరో 10 బంతులు మిగిలుండగానే ఊదేసి, ఆసియాలోనే అతి భారీ లక్ష్య ఛేదన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఊపుతో ఆ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి ఉంటే టీ20ల్లో మొట్టమొదటిసారి 300 పరుగుల టీమ్‌ స్కోర్‌ నమోదయ్యేది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ జల్మీ.. బాబర్‌ ఆజమ్‌ (65 బంతుల్లో 115; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సైమ్‌ అయూబ్‌ (34 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), రోవమన్‌ పావెల్‌ (18 బంతుల్లో 35 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్‌ చేసిం‍ది.

60 బంతుల్లోనే శతక్కొట్టిన పెషావర్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు ఇది పీఎస్‌ఎల్‌లో తొలి సెంచరీ కాగా.. పీఎస్‌ఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్ల (15) రికార్డు కూడా బాబర్‌ ఖాతాలోకే వెళ్లింది. అయితే గంట వ్యవధిలోనే ఈ రికార్డు తారుమారైంది. 241 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్‌.. జేసన్‌ రాయ్‌ (63 బంతుల్లో 145 నాటౌట్‌; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) సునామీ శతకంతో శివాలెత్తడంతో 18.2 ఓవర్లలోనే రికార్డు విజయం సాధించింది.

రాయ్‌కు మార్టిన్‌ గప్తిల్‌ (8 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్‌), విల్‌ స్మీడ్‌ (22 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు), మహ్మద్‌ హఫీజ్‌ (18 బంతుల్లో 41 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో ఎండ్‌ నుంచి పూర్తిగా సహకరించారు. ఫలితంగా గ్లాడియేటర్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాయ్‌ విధ్వంసం ధాటికి 3 పెషావర్‌ బౌలర్లు 11 ఓవర్లలో 167 పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో రాయ్‌ పీఎస్‌ఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (145 నాటౌట్‌) రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు పీఎస్‌ఎల్‌ టాప్‌ స్కోర్‌ రికార్డు కొలిన్‌ ఇంగ్రామ్‌ (127) పేరిట ఉండేది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement