కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇలాంటి దారుణానికి పాల్పడిన దుండగులకు కఠినమైన శిక్ష విధించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చినా భయంతో వణికిపోయేలా తీర్పునివ్వాలని కోరాడు.
కాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ డాక్టర్ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. అత్యంత పాశవికంగా బాధితురాలిపై దారుణానికి పాల్పడ్డారు దుండగులు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో 30 మందిని అనుమానితులుగా చేర్చి.. విచారిస్తున్నామని తెలిపింది.
రోజూ జరిగే ఘటనల్లో ఇదొకటి?
అయితే, ఈ ఘటనపై స్పందించిన సౌరవ్ గంగూలీ.. ‘రోజూ జరిగే ఘటనల్లో ఇదొకటి’ అని అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో అభిమానులు సైతం దాదాపై విరుచుకుపడ్డారు. బాధ్యతారహిత వ్యాఖ్యలు సరికాదంటూ ట్రోల్ చేశారు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ఈ లెజెండరీ క్రికెటర్.. కాస్త ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు నెటిజన్లు.
ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన గంగూలీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు . ‘‘గత ఆదివారం నేను మాట్లాడిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఇదొక భయానక ఘటన అని నేను ఆరోజే చెప్పాను. ప్రస్తుతం సీబీఐ, పోలీసులు ఈ కేసులో లోతుగా విచారణ జరుపుతున్నారు. దోషులు ఎవరన్నది తేలిన తక్షణమే వారికి కఠినాతికఠినమైన శిక్ష విధించాలి.
వాళ్లకు పడే శిక్ష ఎలా ఉండాలంటే?
భవిష్యత్తులో మరొకరు ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే వణికిపోయే పరిస్థితి ఉండాలి. ఎంత కఠినమైన శిక్ష విధిస్తే అంత మంచిది’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. కాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో గంగూలీకి సత్సంబంధాలు ఉన్నాయంటారు అతడి సన్నిహిత వర్గాలు.
ఇక దేశాన్ని కుదిపేస్తున్న డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో దీదీ సర్కారు వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రాగా.. పైవిధంగా స్పందించాడు దాదా.
కాగా 1992 నుంచి 2008 వరకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గంగూలీ.. మేటి కెప్టెన్, బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. 113 టెస్టులాడి 7212, 311వన్డేల్లో 11363 పరుగులు సాధించాడు. బెంగాల్ క్రికెట్ ముఖచిత్రంగా నీరజనాలు అందుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగానూ గతంలో పనిచేశాడు.
చదవండి: తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment