
Prime Volleyball League- Hyderabad Black Hawks: ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్’లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టుకు కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్నారు. ఇప్పటికే బ్యాడ్మింటన్, బాక్సింగ్ లీగ్‌లలో కూడా భాగస్వామ్యం ఉన్న ఆయన ఈ సారి వాలీబాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలని లీగ్‌లో భాగమయ్యేందుకు సిద్ధపడ్డారు. వాలీబాల్ లీగ్ ద్వారా లాభాలు ఆశించడం లేదని, ఆటలపై ఉన్న ఆసక్తితోనే ముందుకు వచ్చానని ఆయన వెల్లడించారు. ‘ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో రెండేళ్లు వరుసగా చాంపియన్‌గా నిలిచిన బెంగళూరు రాప్టర్స్ జట్టు కూడా మాదే.
ఆ తర్వాత ఒక సీజన్‌లో బాక్సింగ్ లీగ్‌లో కూడా జట్టును తీసుకున్నాం. ఐటీ తదితర రంగాల్లో వ్యాపారాలు నా వృత్తి అయినా క్రీడలు ప్రవృత్తి. అందుకే వాలీబాల్ లీగ్‌లోనూ భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నా. టీవీల్లో ప్రసారాల ద్వారా దిగువ స్థాయి వరకు ఆటలకు ప్రచారం లభిస్తుందనేది నా నమ్మకం. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఇష్టపడే వాలీబాల్‌ను కూడా ఇప్పుడు వారికి మరింత చేరువ చేయడమే మా లీగ్ లక్ష్యం.
ఆర్థికపరంగా లీగ్ లాభదాయకం కాదని తెలిసినా కనీసం రాబోయే ఐదేళ్లు దేనికైనా సిద్ధపడే ఇందులోకి వచ్చాను. ఫ్రాంచైజీ జట్లే లీగ్ సమష్టి నిర్వాహకులు కాబట్టి పెద్ద సమస్య లేదు. మా హైదరాబాద్ టీమ్ అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది. అత్యుత్తమ కోచ్ నేత్వత్వంలో టైటిల్ సాధిస్తామనే నమ్మకం ఉంది.
మేం ఆశించిన స్థాయిలో ఈసారి స్థానికంగా ప్రతిభ గల ఆటగాళ్లు లభించకపోయినా వచ్చే ఏడాది మా టీమ్‌లో ఎక్కువ మందికి అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నాం’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ అభిషేక్ వివరించారు. కాగా ఫిబ్రవరి 5 నుంచి వాలీబాల్ క్రీడలో లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ‘రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్’ పేరుతో జరగనున్న ఈ టోర్నీని మొత్తం హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు.
చదవండి: PSL 2022: ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు.. అఫ్రిదిపై ట్రోల్స్ వర్షం