లాహోర్ : పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా పాక్ జట్టు వన్డే కెప్టెన్ బాబర్ అజామ్ తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌ను తప్పుబడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. 40 ఏళ్ల వయసుకు దగ్గర్లో ఉన్న మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లను టీ20 క్రికెట్లో ఇంకా ఎందుకు ఆడిస్తున్నారంటూ చురకలంటించాడు. అసలు పాక్ సెలెక్షన్ టీమ్‌కు సరైన ప్రణాళిక లేదని.. అందుకే వయసుమీద పడ్డవారిని ఆడిస్తున్నారని ఎద్దేవా చేశాడు. టీ20 అంటేనే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహించాలి. కానీ కెప్టెన్‌గా బాబర్‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ అలా ఆలోచించడం లేదని... స్నేహం పేరుతో యువకులకు అవకాశం ఇవ్వడం లేదంటూ విమర్శించాడు. (చదవండి : పృథ్వీ షా.. నీ ప్రతిభ అమోఘం)
'కెప్టెన్‌గా బాబర్ అజామ్ తప్పు చేస్తున్నాడు. టీ20 అనేది యువ ఆటగాళ్లను దృష్ఠిలో పెట్టుకొని రూపొందించింది. కానీ బాబార్ జట్టు మేనేజ్‌మెంట్‌తో కలిసి 40 ఏళ్లకు దగ్గరలో ఉన్న హఫీజ్, మాలిక్‌లను ట20 జట్టుకు ఎంపిక చేయించాడు. ఇది కరెక్ట్ కాదు.. హఫీజ్, మాలిక్‌లు ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లే.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. టీ20 జట్టులో ఈ ఇద్దరు పనికిరారు. రాబోయే రెండేళ్లలో రెంటు టీ20 ప్రపంచకప్‌లు ఆడనున్న పాక్ జట్టులో కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుంటుంది. బాబర్ అజామ్ స్నేహం అనే పదాన్ని పక్కనపెడితే బాగుంటుంది. అయినా కెప్టెన్‌తో పాటు జట్టును ఎంపిక చేసే సెలక్షన్ టీమ్ ధోరణి సరిగా లేదు.జట్టులో ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండాలి. (చదవండి : ‘ఆ బౌలర్‌తో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలే’)
మా సమయంలో ఇలా ఉండేది కాదు.. ఇమ్రాన్ కొత్తగా కెప్టెన్ అయిన సమయంలో మార్పు పేరుతో ఐదు నుంచి ఆరు మంది సీనియర్ ఆటగాళ్లను వన్డే జట్టులో నుంచి తప్పించాం. కేవలం స్థిరంగా ఆడుతున్న జావేద్ మియాందాద్ లాంటి ఆటగాడిని మాత్రమే కొనసాగించాం. యువ ఆటగాళ్లతో నిండిన పాక్ జట్టు 1992లో ప్రపంచకప్ సాధించేవరకు వెళ్లగలిగింది. ఇప్పుడు మాత్రం జట్టు మేనేజ్‌మెంట్ అలా కనిపించడం లేదు. ఎప్పుడైనా ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే ఆటగాళ్ల ఎంపిక జరగాలి.. భవిష్యత్తుకు కూడా అదే మంచిది.' అంటూ రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment