నేటి నుంచి రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు
బరిలో టీమిండియా స్టార్లు
ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్
ఢిల్లీకి పంత్ ప్రాతినిధ్యం
గిల్, జడేజా కూడా సిద్ధం
హిమాచల్‌ప్రదేశ్‌తో హైదరాబాద్ పోరు
పుదుచ్చేరితో తలపడనున్న ఆంధ్ర జట్టు
ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో చాలా కాలం తర్వాత భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ బాట పట్టారు.
నేటి నుంచి దేశవ్యాప్తంగా రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా... భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనని ముందే వెల్లడించగా... ఢిల్లీ జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌లో అతడు కూడా పాల్గొననున్నాడు.
రోహిత్ శర్మ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. ఇప్పటికే స్టార్‌లతో నిండి ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రాకతో మరింత పటిష్టంగా మారింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా జమ్మూ కశీ్మర్‌తో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తలపడుతుంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న ముంబై జట్టు తాజా సీజన్‌లో 5 మ్యాచ్‌లాడి 3 విజయాలు, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్‌లో మూడో స్థానంలో ఉంది.
బరోడా (27 పాయింట్లు), జమ్మూ కశ్మీర్ (23 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ముంబై జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చాలని చూస్తోంది. రోహిత్ రాకతో జట్టు మరింత బలోపేతమైందని ముంబై కెపె్టన్ రహానే పేర్కొన్నాడు. ‘రోహిత్ అంటే రోహితే. అతడికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అతడితో కలిసి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌ను మరోసారి పంచుకోనుండటం ఆనందంగా ఉంది. రోహిత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు.
అంతర్జాతీయ స్థాయిలో అది ఎన్నోసార్లు చూశాం. ఎప్పుడు ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. ఒక్కసారి లయ అందుకుంటే అతడిని ఆపడం కష్టం. ప్రతి ఆటగాడికి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అధిగమించి పరుగుల కోసం తపించడం ముఖ్యం. యశస్వి జైస్వాల్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ జట్టు తరఫునే కాకుండా ముంబై తరఫున కూడా అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు.
అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న వారి సాన్నిహిత్యంలో ముంబై ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటారు’ అని రహానే అన్నాడు. ఆ్రస్టేలియా పర్యటనలో పేలవ ఫామ్‌తో నిరాశ పరిచిన రోహిత్ శర్మ... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు రంజీ ట్రోఫీ ద్వారా తిరిగి లయ అందుకుంటాడా చూడాలి.
పంత్ X జడేజా
రాజ్‌కోట్ వేదికగా జరగనున్న గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో ఢిల్లీ టీమ్ ఆడుతుంది. సౌరాష్ట్ర తరఫున టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగుతుండగా... రిషభ్ పంత్ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చతేశ్వర్ పుజారా, జైదేవ్ ఉనాద్కట్‌లతో సౌరాష్ట్ర జట్టు బలంగా కనిపిస్తోంది.
ఢిల్లీ జట్టులో ఆయుశ్ బదోనీ, యశ్ ధుల్ వంటి యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. క్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి కావడంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయమే.
చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పంజాబ్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ ఆడనుండగా... కర్ణాటక జట్టుకు దేవదత్ పడిక్కల్, ప్రసిధ్ కృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో సెంచరీల మీద సెంచరీలు బాదిన విదర్భ ప్లేయర్ కరుణ్ నాయర్‌పై అందరి దృష్టి నిలవనుంది.
హిమాచల్‌తో హైదరాబాద్ పోరు
ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో హైదరాబాద్ రంజీ జట్టు తలపడనుంది. మరోవైపు పుదుచ్చేరితో ఆంధ్ర జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ జాతీయ విధుల్లో ఉండగా... స్టార్ పేసర్ సిరాజ్ పనిభారం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.
తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు ఒక విజయం, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉండగా... ఆంధ్ర జట్టు ఐదు మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 4 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment