
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ ట్రోపీ ద్వారా సూపర్ రీఎంట్రీ ఇచ్చినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో జడేజా ఏడు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసి రీఎంట్రీ అదుర్స్ అనిపించాడు.
అయితే బౌలింగ్‌లో మెరిసిన జడేజా బ్యాటింగ్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు జడేజా ఎంపికైన సంగతి తెలిసిందే.
హార్విక్ దేశాయ్, సౌరాష్ట్ర క్రికెటర్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే 266 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర 206 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ (205 బంతుల్లో 101 పరుగులు) సెంచరీ వృదాగా మారింది. చివర్లో అర్పిత్ వసవాడ(45 పరుగులు), రవీంద్ర జడేజా(25 పరుగులు) ఆశలు కలిగించినప్పటికి.. ఇద్దరు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో సౌరాష్ట్ర ఓటమి ఖాయమైంది. అంతకముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ దాటికి 133 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment