ముంబై: టీమిండియా టాప్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. తాజాగా ముగిసిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో జడేజా దారుణంగా విఫలం కావడంతో అతనిపై విమర్శనాస్త్రాలు సంధించాడు. మ్యాచ్‌కు ముందు పరిస్థితుల దృష్ట్యా జడేజాను ఆల్‌రౌండర్ కోటాలో కాకుండా బ్యాట్స్‌మెన్ స్థానం కోసం ఎంపిక చేశారని, కానీ టీమిండియా యాజమాన్యం చేసిన ఆ ప్రయోగంతో టీమిండియా నిండా మునిగిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌ను బ్యాట్స్‌మెన్ కోటాలో ఎలా తీసుకుంటారని జడేజాను ఉద్దేశించి విమర్శించాడు. తుది జట్టు ఎంపిక సమయానికి వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అటువంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్‌ను కాకుండా జడేజాను ఆడించడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు.
ఆకాశం మేఘావృతమై, వర్షం వల్ల మ్యాచ్ ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమైనా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం చర్చనీయాంశమని పేర్కొన్నాడు. పిచ్ పొడిగా ఉండి, స్పిన్ అయ్యే ఛాన్స్ ఉంటే అశ్విన్‌తో పాటు జడేజాను తీసుకోవడంలో అర్థం ఉందని, కానీ ఆ పరిస్థితులు ఏకోశానా లేనప్పటికీ జడేజాను ఎంపిక చేయడం అర్ధరహితమని వెల్లడించాడు. ఈ విషయంలో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తుందని అన్నాడు. జడేజాను బ్యాట్స్‌మెన్ కోటాలో జట్టులోకి తీసుకోవాల్సి వస్తే.. అతని కంటే మెరుగైన, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి వైపు మొగ్గు చూపాల్సిందని అభిప్రాయపడ్డాడు.
జడేజా స్థానంలో విహరిని తీసుకుని ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని, ఒత్తిడి సమయాల్లో జడేజా కంటే విహారి చాలా బెటర్ అని, ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైందని పేర్కొన్నాడు. జడేజా బ్యాట్స్‌మెనా.. లేక బౌలరా అన్న విషయం జట్టు యాజామన్యమే తేల్చుకోలేని పరిస్థితిలో ఉందని ఆరోపించాడు. ఈ విషయంలో టీమిండియా వ్యవహరిస్తున్న తీరుకు తాను వ్యతిరేకమని తెలిపాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్లో జడేజా.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి.. తొలి ఇన్నింగ్స్‌లో 15, రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే ఐసీసీ ఇటీవల విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జడ్డూ.. ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
చదవండి: WTC Final: సోనూ భాయ్.. విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపండి ప్లీజ్..!
Comments
Please login to add a commentAdd a comment