
ముంబై: గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా తొలిసారి రెండు దేశాల్లో వేర్వేరు జట్లతో తలపడుతుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో సీనియర్లతో కూడిన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధవన్ కెప్టెన్సీలో యువ భారత జట్టు శ్రీలంకకు వెళ్లింది. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో.. టీమిండియా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ లంకకు వెళ్లిన బృందానికి కోచ్‌గా నియమించబడ్డాడు. ఇదిలా ఉంటే, రెగ్యులర్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌తో ముగియనున్న నేపథ్యంలో అతని తర్వాత కోచ్ ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది.
ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ రేసులో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అందరి కంటే ముందు ఉంటాడని భారత మాజీ ఆల్‌రౌండర్ రితేందర్ సింగ్ సోధి జోస్యం చెప్పాడు. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా, అండర్-19 కోచ్‌గా మంచి సక్సెస్ రేట్ కలిగిన ద్రవిడ్‌కే కోచ్ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీలంక పర్యటన నిమిత్తం ద్రవిడ్‌ను కోచ్‌గా పంపించడంలో బీసీసీఐ ఉద్దేశం క్లియర్‌గా ఉందని, దీంతో రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా ద్రవిడ్‌కు గ్రీన్ సిగ్నల్ అందినట్టేనని పేర్కొన్నాడు. వాస్తవానికి రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే సత్తా కేవలం ద్రవిడ్‌కే ఉందని తెలిపాడు. మరోవైపు రవిశాస్త్రి టీమిండియా కోచ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాడని కొనియాడాడు. కాగా, సోధి భారత్ తరఫున 18 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment