కెప్టెన్‌ను ప్రకటించిన సూపర్ జెయింట్స్
నాయకత్వ బాధ్యతలపై కీపర్ సంతోషం
కోల్‌కతా: ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఊహించిన విధంగానే వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను సారథిగా నియమిస్తున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా సోమవారం జరిగిన కార్యక్రమంలో కెప్టెన్ పంత్‌కు టీమ్ జెర్సీని అందిస్తూ తమ ఎల్‌ఎస్‌జీ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ వేలంలో రూ. 27 కోట్లకు పంత్‌ను లక్నో సొంతం చేసుకోవడంతోనే అతనే కెపె్టన్ కావడం దాదాపు ఖాయమైంది. ‘కొత్త ఆశలు, ఆశయాలతో పాటు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కొత్తగా మేం మొదలు పెడుతున్నాం.
మీకందరికీ మా కొత్త కెప్టెన్ రిషభ్ పంత్‌ను పరిచయం చేస్తున్నాం. మా జట్టుకు సంబంధించి ఇదో కీలక క్షణం. మూడేళ్లు ముగిసిన తర్వాత మా ప్రణాళికల్లో మార్పులతో ముందుకు వెళ్లబోతున్నాం’ అని గోయెంకా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీమ్ మెంటార్ జహీర్ ఖాన్ కూడా పాల్గొన్నాడు. ఐపీఎల్‌లో మూడు సీజన్లు ఆడిన లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. తొలి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆ జట్టు గత ఏడాది పూర్తిగా విఫలమైంది. దాంతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై కూడా విమర్శలు రావడంతో మార్పు అనివార్యమైంది. వేలంలో పంత్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇప్పుడు కెపె్టన్‌గా బాధ్యతలు అప్పగించింది. 2016 నుంచి 2024 వరకు ఢిల్లీ టీమ్ సభ్యుడైన పంత్... మూడేళ్లు నాయకుడిగా కూడా పని చేశాడు.
200 శాతం ప్రదర్శన కనబరుస్తా...
దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున ఆడినా... పంత్ స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్. గతంలో ఇది ఉత్తరప్రదేశ్‌లోనే భాగం. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన ఐపీఎల్ టీమ్‌కు అంటే దాదాపుగా సొంత టీమ్‌కు అతను ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. లక్నో మేనేజ్‌మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని పంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నా వైపు నుంచి ఎలాంటి లోపం లేకుండా 200 శాతం కష్టపడతానని మీకు మాటిస్తున్నా. కొత్త ఉత్సాహంతో కొత్త జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా. నాకు ఇచి్చన బాధ్యతలతో సంతోషంగా ఉన్నా.
టీమ్‌లో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. కొత్త లక్ష్యాలతో మా ప్రయాణం మొదలైంది’ అని పంత్ వ్యాఖ్యానించాడు. కెపె్టన్‌గా తాను ఇప్పటికే ఎంతో నేర్చుకున్నానని పంత్ అన్నాడు. ‘ఇక్కడ కొత్త ఫ్రాంచైజీ, కొత్త ఆరంభం అని నాకు తెలుసు. కానీ కెప్టెన్సీ బాధ్యతలు నాకు కొత్త కాదు. అయితే మా జట్టు అవసరాలను బట్టి నేనేం చేయాలో మేనేజ్‌మెంట్‌తో చర్చిస్తా. సహచరులకు అండగా ఎలా నిలవాలో, వారినుంచి మంచి ప్రదర్శన ఎలా రాబట్టాలో రోహిత్ శర్మ నుంచి, ఇతర సీనియర్ ఆటగాళ్ల నుంచి కూడా ఎంతో నేర్చుకున్నా. ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనే విషయంపై నాకు స్పష్టత ఉంది’ అని పంత్ వివరించాడు.
పంత్‌లో సత్తా ఉంది...
భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న 2016లో పంత్ మొదటిసారి ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్‌తో పంత్ మళ్లీ కలిసి పని చేయనున్నాడు. ‘ఎన్నో ఆటుపోట్లను దాటి పంత్ క్రికెటర్‌గా ఎదగడం నేను ప్రత్యక్షంగా చూశాను. తన ఆటతో అతను అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. ఇకపై అతను సాధించాల్సింది ఎంతో ఉంది. ఇక్కడ పంత్ ఆ పని చేయగలడు’ అని జహీర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు తమ జట్టు మిడిలార్డర్‌లో అంతా ఎడంచేతి వాటం బ్యాటర్లు ఉండటం కూడా ఒకరకమైన వ్యూహమని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment