
రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్ కఠోరంగా శ్రమిస్తున్నాడు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో చెమటలు చిందిస్తున్నాడు. మునుపటి తరహాలో తన ట్రేడ్‌మార్క్ షాట్లైన సింగిల్ హ్యాండెడ్ సిక్సర్లతో ఇరగదీస్తున్నాడు. పంత్ ఒంటిచేత్తో సిక్సర్లు బాదుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. దీన్ని చూసి పంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమ అభిమాన ఆటగాడి పూర్వపు స్థితిని చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. పంత్ ఇదే జోరును రానున్న ఐపీఎల్ సీజన్‌లోనూ కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. మార్చి 22 నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్ 17వ సీజన్‌లో పంత్ బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది. వికెట్ కీపర్‌గా ఇతర ఆటగాడి సేవలు వినియోగించుకోనున్నారు.
Rishabh Pant and those one handed sixes. 🥹❤️pic.twitter.com/hRtPvrobPy
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2024
పంత్ బ్యాటింగ్ వరకే పరిమితమవుతాడని ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కూడా స్పష్టం చేశాడు. 2022 డిసెంబర్ 31న జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఏడాది అనంతరం ఐపీఎల్‌తో పంత్ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పంత్ గైర్హాజరీలో గత ఎడిషన్‌లో డీసీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవహరించాడు.
కాగా, రానున్న ఐపీఎల్ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. మొహాలీలో జరిగే ఆ మ్యాచ్‌లో డీసీ టీమ్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మొదలవుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు: రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎంగిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యష్ ధుల్, ముఖేష్ కుమార్, హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, జై రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికార.
Comments
Please login to add a commentAdd a comment