Michael Clarke Slams Rishabh Pant After Heavy Loss Against KKR, Says He Got It Wrong | Sakshi
Sakshi News home page

IPL 2024 DC Vs KKR: రిషభ్‌ పంత్‌దే తప్పు.. అతడి వల్లే ఓటమి!

Published Tue, Apr 30 2024 11:24 AM

Rishabh Got it wrong: Michael Clarke Slams Pant After Heavy Loss vs KKR

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ తీరును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ తప్పుబట్టాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓటమి అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలను విమర్శించాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై పరుగులు రాబట్టడంలో విఫలమైన తరుణంలో పంత్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం ఏమీ బాలేదన్నాడు.

పవర్‌ప్లే ముగిసేసరికి
ఐపీఎల్‌-2024లో సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ కేకేఆర్‌ను ఢీకొట్టింది. టాస్‌ గెలిచిన పంత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కేకేఆర్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌  వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో మొదలు పెట్టినా... పృథ్వీ షా (13) ఎక్కువసేపు నిలవలేదు.

స్టార్క్‌ తర్వాతి ఓవర్లోనే వరుసగా 6, 4 కొట్టిన జేక్‌ ఫ్రేజర్‌ (12) తర్వాతి బంతికి వెనుదిరగడంతో ఢిల్లీకి ఆశించిన ఆరంభం లభించలేదు. షై హోప్‌ (6) విఫలం కాగా... హర్షిత్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అభిషేక్‌ పొరేల్‌ (18) కూడా జోరు కొనసాగించలేకపోయాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 67 పరుగులకు చేరింది.

కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా తనదైన శైలిలో ఆడలేకపోవడంతో క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. 18 పరుగుల వద్ద తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హర్షిత్‌ వదిలేయడంతో బతికిపోయిన పంత్‌ దానిని వాడుకోలేకపోయాడు.

కుల్దీప్‌ చక్కటి షాట్లు
ఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, స్టబ్స్‌ (4), అక్షర్‌ (15) వెనుదిరగ్గా... 101/7 వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసేలా కనిపించింది. అయితే కుల్దీప్‌ కొన్ని చక్కటి షాట్ల(26 బంతుల్లో 35)తో చివరి వరకు నిలబడటంతో క్యాపిటల్స్‌ 150 పరుగులు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌.. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీని మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సారథి పంత్‌ మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడం మంచి ఆప్షనే. కాకపోతే మా బ్యాటింగ్‌ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

రిషభ్‌ పంత్‌దే తప్పు.. అతడి వల్లే ఓటమి!
ఇక్కడ 180 -210 పరుగులు స్కోరు చేయవచ్చు. కాకపోతే ఈరోజు మాత్రం కాస్త పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు.

ఈ మేరకు పంత్‌ చేసిన వ్యాఖ్యలపై మైకేల్‌ క్లార్క్‌ స్పందిస్తూ.. ‘‘ఓటమి తర్వాత పంత్‌ మాట్లాడిన తీరుతో నేను ఏకీభవించను. ఒకవేళ గెలిచి ఉంటే ఆ నిర్ణయం(టాస్‌) సరైందిగా ఉండేది.

ఓడిపోయారు కాబట్టి తప్పును అంగీకరించాల్సిందే. ఇలాంటి పిచ్‌పై పంత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని కచ్చితంగా తప్పు చేశాడనే నా అభిప్రాయం. వాళ్లు కేవలం పది పరుగులు కాదు.. తక్కువలో తక్కువ యాభై పరుగులు వెనుకబడి ఉన్నారు.

ఎందుకంటే లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఇంకా 3.3 ఓవర్లు మిగిలే ఉన్నాయన్న విషయం మరవొద్దు. చేతిలో ఏడు వికెట్లు కూడా ఉన్నాయి. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ కనీసం 200 పరుగులు చేయాల్సింది’’ అని అభిప్రాయపడ్డాడు. 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement