
జెనీవా: ప్రస్తుత ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరనగానే ఠక్కున లియోనల్ మెస్సీ లేదా క్రిస్టియానో రొనాల్డో పేరు చెప్పేస్తారు. కానీ ఇప్పుడు పోలాండ్ కెపె్టన్ రాబర్ట్ లెవన్‌డౌస్కీ పేరును కూడా గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే 2020 ఏడాదికి ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అత్యుత్తమ ప్లేయర్‌గా లెవన్‌డౌస్కీ ఎంపికయ్యాడు. ఈ ఏడాది బయార్న్ మ్యూనిక్ జట్టు తరఫున 55 గోల్స్‌తో చెలరేగిన లెవన్‌డౌస్కీని ‘బెస్ట్ ప్లేయర్’ పురస్కారంతో ‘ఫిఫా’ గౌరవించింది.
అతను ఈ అవార్డు కోసం మెస్సీ, రొనాల్డోలతో పోటీపడి విజేతగా నిలవడం విశేషం. గత 13 ఏళ్లలో మెస్సీ, రొనాల్డోకు దక్కకుండా ఫిఫా బెస్ట్ ప్లేయర్ పురస్కారం మరొకరిని వరించడం ఇది రెండోసారి మాత్రమే. 2018లో రియల్ మాడ్రిడ్ మిడ్‌ఫీల్డర్ లుకా మోడ్రిక్, తాజాగా రాబర్ట్ ఈ అవార్డును అందుకున్నారు. మహిళల విభాగంలో ఈ ఏడాది అత్యుత్తమ ప్లేయర్‌గా లూసీ బ్రాంజ్ (ఇంగ్లండ్) నిలిచింది.