
విశ్వవేదికపై మరోసారి భారత జెండా రెపరెపలాడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది.
ఈ విజయంతో ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన వన్డే రిటైర్మెంట్ వస్తున్న వార్తలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హిట్‌మ్యాన్.. ఇప్పటిలో రిటైర్ అయ్యే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు.
ఇప్పుడే కాదు..
"చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు.
సరైన షాట్‌లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు.
మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్ కావడం లేదు.
ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను. సుదీర్ఘమైన క్రికెట్ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుంది. అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతోంది అని 38 ఏళ్ల రోహిత్ పోస్ట్‌మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రోహిత్, కోహ్లి ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగే అవకాశముంది.
భారత్ ఆల్‌రౌండ్ షో..
ఈ ఫైనల్ పోరులో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక నాక్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, జెమీసన్ చెరో వికెట్ సాధించింది.
చదవండి:మా స్పిన్నర్లు అద్భుతం.. ఆ ఇద్దరు సూపర్.. అతడు నాణ్యమైన బౌలర్: రోహిత్