ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరేందుకు మార్గం మరింత సుగమం అయ్యింది. ఇక పరిమిత ఓవర్లలో టీమిండియా సారథిగా విజయవంతమైన రోహిత్ శర్మ.. టెస్టుల్లో కూడా జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు.
అయితే, జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన ఇప్పుడే అంచనాకు రావడం కష్టమే. కెప్టెన్‌గా పూర్తి స్థాయి టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి అయినా రోహిత్ తన ముద్ర వేయగలిగాడు. ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా హిట్‌మ్యాన్ అద్భుతంగా రాణించాడు.
తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన రోహిత్.. రెండు టెస్టులో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక తొలి రెండు టెస్టుల్లో సారథిగా ఆస్ట్రేలియాను మట్టికరిపించిన రోహిత్ శర్మపై సర్వాత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల టెస్ట్ కెప్టెన్సీ మధ్య పెద్దగా తేడాలు లేవని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో సారథిగా కోహ్లి వ్యూహాలనే రోహిత్ అనుసరిస్తున్నాడని అతడు చెప్పుకొచ్చాడు.
'నిజం చెప్పాలంటే.. రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. కానీ రెడ్‌బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య పెద్దగా తేడా లేదు. గతంలో విరాట్ కూడా ఇటువంటి వ్యూహాలనే రచించేవాడు. ఇప్పుడు రోహిత్ కూడా విరాట్ శైలినే అనుసరిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా రోహిత్‌కు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల పర్యటనలకు వెళ్లినప్పుడు అసలైన సవాలు ఎదురవుతుంది.
ఎందుకంటే గతంలో కోహ్లికి కూడా విదేశీ పర్యటనలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ అక్కడ విరాట్ సారథిగా విజయవంతమయ్యాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్, విరాట్‌లలో ఎవరు అత్యుత్తమ కెప్టెన్ అని ఇప్పుడు నేను చెప్పలేను. ఎందుకంటే రోహిత్ విదేశీ గడ్డపై సారథిగా ఎలా రాణిస్తాడో ఇప్పుడే నేను అంచనా వేయలేను" అని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు.
చదవండి: Ind Vs Aus: చెత్త బ్యాటింగ్.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment