అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్‌లో కోల్‌కతాపై విజయం తమ జట్టులో జోష్ నింపిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం జట్టు సమిష్టి ప్రదర్శనపై రోహిత్ స్పందించాడు.' చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమి తర్వాత మా గేమ్‌ప్లాన్‌ను మార్చాలనుకున్నాం. అందుకు తగ్గట్టే కోల్‌కతాతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో దూకుడుగా ఆడాలనే నిశ్చయించుకున్నాం. దానికి తగ్గట్టే మా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. గేమ్‌ప్లాన్ సరిగ్గా రావడంతో మ్యాచ్ గెలిచాం. దీనికి తోడు జట్టు సమిష్టి ప్రదర్శన కలిసొచ్చింది. ఇక నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. 54 బంతులెదుర్కొని 80 పరుగులు చేయడం సంతోషమే.. దానిని సెంచరీగా మలిస్తే బాగుండేది. సీఎస్‌కేతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో జరిగిన పొరపాటును రిపీట్ కాకుండా చూసుకోవాలనుకున్నా. అందుకు తగ్గట్టే ఆడుతూ.. పిచ్ నా కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత బ్యాట్ ఝుళిపించా. (చదవండి : కమిన్స్ విఫలం వెనుక కారణం ఇదే)
అంతేగాక మధ్య ఓవర్లలో ఎంతసేపు నిలబడితే చివర్లో అంత వేగంగా పరుగులు సాధిస్తామనే 50 పరుగులు తర్వాత కాస్త నెమ్మదించాను. కానీ అనూహ్యంగా 80 పరుగుల వద్ద ఔట్ కావాల్సి వచ్చింది. అప్పటికే అలసిపోయాను అనే ఫీలింగ్ కలిగింది.. దాంతో సెంచరీ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలగలేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మా జట్టు ముందు మ్యాచ్‌తో పోలిస్తే చాలా మెరుగుపడింది. జట్టుతో ఆలస్యంగా కలిసినా బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే యూఏఈలో ఐపీఎల్ జరుగుతుందని ముందు మేం ఊహించలేదు. కానీ మా పేస్ పవర్ ముంబై వాంఖడేలో సరిగ్గా సరిపోయేది. కానీ ఇక్కడ స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తున్నా.. మా బౌలర్లు మంచి ప్రదర్శనే కనబరిచారు. రానున్న రోజుల్లో దీనిని ఇలాగే కొనసాగిస్తామ’ని చెప్పకొచ్చాడు.
కాగా రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మరో 10 పరుగులు చేస్తే 5 వేల పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులెక్కనున్నాడు. ఇప్పటివరకు రోహిత్ ఐపీఎల్‌లో 190 మ్యాచ్‌ల్లో 4990 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్థ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ కంటే ముందు కోహ్లి, రైనాలు ఐపీఎల్‌లో 5 వేల పరుగులు సాధించారు. రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్‌లో 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విండీస్ స్టార్ క్రిస్ గేల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) పేరిట ఉంది. గేల్ 326 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, ఏబీ డివిలియర్స్ 214, ఎంఎస్ ధోనీ 212 సిక్సర్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. సురేష్ రైనా 194 సిక్సర్లతో టాప్ 5లో ఉన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సెప్టెంబర్ 28న తలపడనుంది. (చదవండి : కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!)
Comments
Please login to add a commentAdd a comment