అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌ని ఓటమితో ఆరంభించిన ముంబై ఇండియన్స్ బుధవారం మరో బిగ్‌ఫైట్‌కు రెడీ అయింది. హిట్టర్లతో బలంగా కనిపిస్తున్న కోల్‌కతా నైటరైడర్స్‌తో అబుదాబి వేదికగా తలపడనుంది. ముంబై, కోల్‌కతాల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరిగాయి. అయితే విజయాల్లో ముంబైదే పైచేయిగా కనిపిస్తుంది. వీరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఏకంగా 19 మ్యాచ్‌ల్లో ముంబయి గెలుపొందగా.. 6 మ్యాచ్‌ల్లో మాత్రమే కోల్‌కతా విజయం సాధించింది. అయితే.. 2014లో యూఏఈ వేదికగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా.. అబుదాబి వేదికగా ఈ రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఏకంగా 41 పరుగుల తేడాతో ముంబయిపై గెలుపొందడం గమనార్హం. కాగా గత ఐదు మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే 4-1 తేడాతో ముంబై కోల్‌కతాపై పైచేయిలో ఉంది. ముంబై ఇండియన్స్ 4సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గగా.. కోల్‌కతా రెండుసార్లు ఆ ఫీట్‌ను సాధించింది. (చదవండి : 'సామ్సన్ తోపు .. కాదంటే చర్చకు రెడీ')
బలాబలాలు
దినేష్ కార్తిక్ సారధ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బలంగానే కనిపిస్తుంది. ఇటీవల ముగిసిన కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటిన వెస్టిండీస్ హిట్టర్లు ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌తో పాటు ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లు ఇయాన్ మోర్గాన్, టామ్ బాంటన్‌లు కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు రాణించినా ఇక ముంబైకి కష్టాలు తప్పవు. వీరితో పాటు కెప్టెన్ దినేశ్ కార్తీక్, నితీశ్ రాణా, శుభమన్ గిల్ కూడా హిట్టింగ్‌లో రాటుదేలినవారే.. దీంతో కోల్‌కతా బ్యాటింగ్ విభాగం దుర్బేధ్యంగా ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో గతేడాది వేలంలో అత్యధిక ధర పలికిన పాట్ కమిన్స్ జట్టు బౌలింగ్‌లో కీలకపాత్ర పోషించనున్నాడు. యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా కీలకం కానున్నాడు.
ఇక ముంబై విషయానికి వస్తే.. చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ విఫలమై 5 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను చెన్నైకి అప్పగించింది. అయితే జట్టుగా చూసుకుంటే ముంబై ఎప్పటికీ ప్రమాదకారే.. మొదట ఓటమిలతో లీగ్‌ను ప్రారంభించినా ఆ తర్వాత ఫుంజుకునే సత్తా ముంబైకి ఉంది. హిట్‌మాన్ రోహిత్, డికాక్, సౌరబ్ తివారి, పొలార్డ్, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. గత మ్యాచ్‌లో సౌరభ్ తివారి మంచి ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. కాగా బౌలింగ్ విభాగంలో బుమ్రా, బౌల్ట్‌లతో బలంగా కనిపిస్తున్నా.. లసిత్ మలింగ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. మరీ కోల్‌కతాతో మ్యాచ్‌లో ముంబై ఏ విధంగా ఆడుతుందన్నది కొద్ది సేపట్లో తేలనుంది.
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, పాటిన్‌సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా
కోల్‌కతా తుది జట్టు : దినేష్ కార్తిక్(కెప్టెన్), శుభమన్ గిల్, నితీష్ రాణా, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, పాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, నిఖిల్ నాయక్, సందీప్ వారియర్
Comments
Please login to add a commentAdd a comment