IPL 2021, RCB vs KKR: భళా... బెంగళూరు | Royal Challengers Bangalore Beat Kolkata Knight Riders by 38 Runs | Sakshi
Sakshi News home page

IPL 2021, RCB vs KKR: భళా... బెంగళూరు

Published Mon, Apr 19 2021 5:08 AM | Last Updated on Mon, Apr 19 2021 9:39 AM

Royal Challengers Bangalore Beat Kolkata Knight Riders by 38 Runs - Sakshi

మ్యాక్స్‌వెల్‌, డివిలియర్స్‌

చెన్నై: ఐపీఎల్‌లో ఆది నుంచి ఊరిస్తోన్న టైటిల్‌ను ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఈ సీజన్‌లో వరుసగా మూడో విజయం సాధించింది. రెండుసార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి జట్టు సమష్టి ఆటతీరుతో అదరగొట్టింది.

తొలుత ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (49 బంతుల్లో 78; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఏబీ డివిలియర్స్‌ (34 బంతుల్లో 76 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించగా... అనంతరం బౌలర్లు కైల్‌ జేమీసన్‌ (3/41),  హర్షల్‌ పటేల్‌ (2/17), యజువేంద్ర చహల్‌ (2/34) కోల్‌కతాను కట్టడి చేశారు. దాంతో విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలోని బెంగళూరు జట్టు 38 పరుగుల తేడాతో కోల్‌కతాపై ఘనవిజయం నమోదు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి ఓడిపోయింది. ఆండ్రీ రసెల్‌ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇయాన్‌ మోర్గాన్‌ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు), షకీబుల్‌ హసన్‌ (25 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్‌) జట్టు విజయం కోసం విఫలయత్నం చేశారు.  

మొదట మ్యాక్సీ... చివర్లో డివిలియర్స్‌...
బెంగళూరు సారథి కోహ్లి టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేయడానికి వచ్చిన వరుణ్‌ చక్రవర్తి... కోహ్లి (5), రజత్‌ పటిదార్‌ (1)లను మూడు బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చి కేకేఆర్‌కు డబుల్‌ బ్రేక్‌ను అందించాడు. అయితే కోల్‌కతా జట్టులో ఈ ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (28 బంతుల్లో 25; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. పవర్‌ప్లేలో ఆర్‌సీబీ 45/2గా నిలిచింది. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఒక సిక్స్, ఒక ఫోర్‌ కొట్టిన మ్యాక్సీ... ఆ మరుసటి ఓవర్‌లో మరో ఫోర్‌ కొట్టి 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే పడిక్కల్‌ను ప్రసిధ్‌ కృష్ణ అవుట్‌ చేయడంతో... 86 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చి రావడంతోనే డివిలియర్స్‌ మెరుపులు మెరిపించడం మొదలు పెట్టాడు. మ్యాక్స్‌వెల్‌ అవుటయ్యే సమయానికి ఆర్‌సీబీ స్కోరు 148/4గా ఉంది. ఇక్కడి నుంచి డివిలియర్స్‌ మరింత చెలరేగిపోయాడు. రసెల్‌ వేసిన 18వ ఓవర్‌లో 6, 4, 2, 4, 0  కొట్టిన అతడు... 19వ ఓవర్లో మరో సిక్సర్‌ కొట్టి 27 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న జేమీసన్‌ కూడా ఫోరు, సిక్సర్‌ బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. చివరి ఓవర్‌ను వేయడానికి మరోసారి బంతిని అందకున్న రసెల్‌ను డివిలియర్స్‌ ఈసారి చావబాదాడు. వరుసగా 4, 6, 2, వైడ్, 4, 0, 4లతో 21 పరుగులను పిండుకున్నాడు. డివిలియర్స్‌ దూకుడుతో చివరి ఐదు ఓవర్లలో ఆర్‌సీబీ 70 పరుగులు సాధించింది.

లక్ష్యానికి దూరంగా...
భారీ లక్ష్యంతో ఛేదన ఆరంభించిన కోల్‌కతా ఆ దిశగా ఏ దశలోనూ సాగలేదు. శుబ్‌మన్‌ గిల్‌ (9 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (25), మోర్గాన్‌  క్రీజులో నిలదొక్కు కుంటున్న సమయంలో అవుటయ్యారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న నితీశ్‌ రాణా (18) కూడా అవుటవ్వడంతో కేకేఆర్‌ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. చివర్లో రసెల్, షకీబ్‌  ప్రతిఘటించినా అప్పటికే ఆలస్యమైపోయింది.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) త్రిపాఠి (బి) వరుణ్‌ 5; పడిక్కల్‌ (సి) త్రిపాఠి (బి) ప్రసిధ్‌ కృష్ణ 25; పటిదార్‌ (బి) వరుణ్‌ 1; మ్యాక్స్‌వెల్‌ (సి) హర్భజన్‌ సింగ్‌ (బి) కమిన్స్‌ 78; డివిలియర్స్‌ (నాటౌట్‌) 76; జేమీసన్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 204.
వికెట్ల పతనం: 1–6, 2–9, 3–95, 4–148.
బౌలింగ్‌: హర్భజన్‌ సింగ్‌ 4–0–38–0, వరుణ్‌ 4–0–39–2, షకీబుల్‌ హసన్‌ 2–0–24–0, కమిన్స్‌ 4–0–34–1, ప్రసిధ్‌ కృష్ణ  4–0–31–1, రసెల్‌ 2–0–38–0.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: నితీశ్‌ రాణా (సి) పడిక్కల్‌ (బి) చహల్‌ 18; గిల్‌ (సి) సబ్‌–క్రిస్టియాన్‌ (బి) జేమీసన్‌ 21; త్రిపాఠి (సి) సిరాజ్‌ (బి) సుందర్‌ 25; మోర్గాన్‌ (సి) కోహ్లి (బి) హర్షల్‌ పటేల్‌ 29; దినేశ్‌ కార్తిక్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 2; షకీబుల్‌ హసన్‌ (బి) జేమీసన్‌ 26; రసెల్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 31; కమిన్స్‌ (సి) డివిలియర్స్‌ (బి) జేమీసన్‌ 6; హర్భజన్‌ సింగ్‌ (నాటౌట్‌) 2; వరుణ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166.
వికెట్ల పతనం: 1–23, 2–57, 3–66, 4–74, 5–114, 6–155, 7–161, 8–162.
బౌలింగ్‌: సిరాజ్‌ 3–0–17–0, జేమీసన్‌ 3–0–41–3, చహల్‌ 4–0–34–2, సుందర్‌ 4–0–33–1, మ్యాక్స్‌వెల్‌ 2–0–24–0, హర్షల్‌ పటేల్‌ 4–0–17–2. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement