సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నండ్రే బర్గర్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో మిగిలిన రెండు వన్డేలతో పాటు.. బంగ్లాదేశ్ పర్యటనకూ దూరమయ్యాడు. కాగా సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంది.
అక్కడ ఐర్లాండ్‌తో రెండు టీ20లు ప్రొటిస్ జట్టు.. సిరీస్‌ను 1-1తో కలిసి ప్రత్యర్థితో పంచుకుంది. ఈ క్రమంలో బుధవారం నుంచి వన్డే సిరీస్ మొదలుపెట్టింది. మొదటి మ్యాచ్‌లో 139 పరుగులతో ఐరిష్ జట్టును చిత్తు చేసిన సౌతాఫ్రికా.. శుక్రవారం రెండో వన్డేలో తలపడుతోంది.
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరం
అయితే, ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే క్రికెట్ సౌతాఫ్రికా నండ్రే బర్గర్ గాయం గురించి వెల్లడించింది. ఈ పేసర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని.. దీంతో ఐర్లాండ్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడని తెలిపింది. అదే విధంగా.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా బర్గర్ అందుబాటులో ఉండకపోవచ్చని... త్వరలోనే అతడి స్థానాన్ని వేరొక ఆటగాడితో భర్తీ చేస్తామని పేర్కొంది.
టీమిండియాతో సిరీస్‌లతో అరంగేట్రం
కాగా ఐర్లాండ్‌తో తొలి వన్డేలోనూ బర్గర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక గతేడాది డిసెంబరులో టీమిండియాతో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన నండ్రే బర్గర్.. అదే నెలలో వన్డే, టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. భారత జట్టుతో జరిగిన మూడు టెస్టుల్లో కలిపి 14 వికెట్లు తీసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. ఐదు వన్డేల్లో ఆరు, రెండు టీ20లలో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ తర్వాత క్రికెట్ సౌతాఫ్రికా వన్డే చాలెంజ్ టోర్నీలో రాణించిన 29 ఏళ్ల నండ్రే బర్గర్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రాజస్తాన్ తరఫున ఆరు మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్-2024లో రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా జట్టులోనూ రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. కాగా సౌతాఫ్రికా జట్టు అక్టోబరు 16న బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టనుంది.
రెండు టెస్టులు
ఇరు జట్ల మధ్య అక్టోబరు 21- నవంబరు 2 వరకు రెండు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఇందుకు సంబంధించి సౌతాఫ్రికా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు అన్రిచ్ నోర్జే, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడీ, గెరాల్డ్ కోయెట్జీ వంటి వంటి స్టార్ పేసర్లు దూరమయ్యారు. తాజాగా బర్గర్ కూడా దూరం కావడం ప్రభావం చూపవచ్చు.
బంగ్లాతో టెస్టులకు దక్షిణాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనూరన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రెకల్టన్ వెర్రేన్నే(వికెట్ కీపర్).
Comments
Please login to add a commentAdd a comment