చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్(Saim Ayub) తీవ్రంగా గాయపడ్డాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో ఫిజియోలు వచ్చి పరీక్షించినా ఫలితం లేకపోయింది.
ఫలితంగా ఆయుబ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. కాగా 2023లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 22 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. గతేడాది వన్డే, టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 27 టీ20లలో 498 పరుగులు చేసిన ఆయుబ్.. ఏడు టెస్టుల్లో 364 రన్స్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు.
సౌతాఫ్రికా గడ్డపై పాక్ చరిత్ర
అయితే, వన్డేల్లో మాత్రం ఆయుబ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు శతకాల సాయంతో.. 515 పరుగులు సాధించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్‌లో ఓడిపోయిన పాక్.. వన్డేల్లో మాత్రం 3-0తో క్లీన్‌స్వీప్ చేసి.. సౌతాఫ్రికా గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
ఇక ఈ టూర్‌లో భాగంగా ఆఖరిగా టెస్టు సిరీస్‌లో తలపడుతున్న పాకిస్తాన్.. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం ఆఖరిదైన రెండో టెస్టు మొదలైంది. కేప్‌టౌన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆయుబ్
ఈ క్రమంలో ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ను పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ వేయగా.. క్రీజులో ఉన్న రియాన్ రెకెల్టన్ షాట్ బాదాడు. బంతి గల్లీ, బ్యాక్‌వర్డ్ పాయింట్ల మీదుగా దూసుకుపోతుండగా.. ఫీల్డర్లు జమాల్- ఆయుబ్ దానిని ఆపే ప్రయత్నం చేయగా... బంతి జమాల్ చేజిక్కింది.
సౌతాఫ్రికాలో వరుస సెంచరీలు
అయితే, ఈ క్రమంలో ఆయుబ్ కుడికాలి మడిమ మెలిక పడింది. తీవ్ర నొప్పితో అతడు మైదానం వీడాడు. అతడి స్థానంలో అబ్దుల్లా షఫీక్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. కాగా సయీమ్ ఆయుబ్ మడిమ విరిగినట్లు సమాచారం. దీంతో అతడు సొంతగడ్డపై జరిగే ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.
అదే జరిగితే పాక్‌కు మాత్రం గట్టి షాక్ తగిలినట్లే. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుపై పరుగుల వరద పారించడంతో పాటు సౌతాఫ్రికా గడ్డపై కూడా రెండు శతకాలతో చెలరేగాడు. ఇలాంటి ఇన్ ఫామ్ ఓపెనర్ సేవలను కోల్పోతే మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బలు తప్పవు!
చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!
Comments
Please login to add a commentAdd a comment