
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ పర్వాలేదనపించాడు. తొలి మూడు టెస్టులో పెద్దగా ఆకట్టుకోపోయిన భరత్.. ఆఖరి టెస్టులో మాత్రం 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ విషయం పక్కన పెడితే.. వికెట్ల వెనుక మాత్రం భరత్ అద్భుతంగా రాణించాడు. రివ్యూల విషయంలో కూడా కెప్టెన్ రోహిత్ శర్మకు విలువైన సూచనలు చేశాడు.
ఈ నేపథ్యంలోనే భరత్‌ను ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొంత మంది అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. కాగా ఆసీస్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రాహుల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో అతడు ఆఖరి రెండు టెస్టులకు జట్టులో స్థానం కోల్పోయాడు.
అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత జట్టులో రాహుల్ చోటు దక్కడం ప్రస్తుతం ప్రశ్నర్థకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ సబా కరీమ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెఎస్ భరత్ అద్భుతమైన ఆటగాడని, అతడికి మరిన్ని అవకాశాలు టీమిండియా అవకాశాలు ఇవ్వాలని కరీం సూచించాడు.
హిందూస్తాన్ టైమ్స్‌తో కరీం మాట్లాడుతూ.. "డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో ఎవరు ఉంటారన్నది మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అది భారత క్రికెట్‌కు శుభసూచికం. ముఖ్యంగా కేఎస్ భరత్ వంటి ఆటగాడు టీమిండియా తరపున అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది.
అయితే అరంగేట్ర సిరీస్‌లోనే ఎవరూ అద్భుతాలు సృష్టించలేరు కదా. కాబట్టి కెఎస్ భరత్‌కి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. భారత పరిస్థితుల్లో రాణించడం అంత సులభం కాదు. అతడు స్టంప్‌ల వెనుక కూడా చాలా చురుకుగా ఉన్నాడు. భరత్ నెమ్మదిగా తన ఆటతీరును మార్చుకుంటున్నాడు. కాబట్టి అతడికి కాస్త సమయం ఇస్తే అతడు అద్భుతాలు సృష్టిస్తాడు. ఒక వేళ డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కేఎల్ రాహుల్ ఉన్న భరత్‌నే వికెట్ కీపర్‌గా కొనసాగించాలి అని అతడు పేర్కొన్నాడు. కాగా లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7- 11 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది.