
పారిస్ ఒలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. మహిళల 50 కేజీల విభాగంలో వరస విజయాలతో ఫైనల్‌కు చేరిన ఫొగాట్.. వంద గ్రాములు అదనపు బరువు కారణంగా పతకానికి దూరమై రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.
ఈ నేపథ్యంలో సచిన్ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘ప్రతి ఆటలో నిబంధనలు ఉంటాయి. వాటిని సందర్భానుసారంగా చూడాలి. అవసరమైతే మార్పులు చేయాలి. వినేశ్ చక్కటి ఆటతీరుతో ఫైనల్‌కు చేరింది. తుదిపోరుకు ముందు అదనపు బరువు కారణంగా అనర్హత వేటు పడి రజత పతకానికీ దూరమైంది.
దీనికి సరైన కారణం కనిపించడం లేదు. ఇందులో క్రీడా స్ఫూర్తి లోపించినట్లే’ అని సచిన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. డ్రగ్స్ వంటి అనైతిక చర్యలతో అనర్హతకు గురై ఉంటే చివరి స్థానం ఇవ్వడం సబబే అని.. కానీ వినేశ్ న్యాయంగా పోరాడి ఫైనల్‌కు చేరిందని సచిన్ గుర్తు చేసుకున్నాడు.
ఫొగాట్ రజత పతకానికి అర్హురాలే అని.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్) తీర్పు తర్వాత అయినా వినేశ్‌కు పతకం వస్తుందని ఆశిస్తున్నట్లు సచిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు.