Ind vs NZ: ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్‌ వీరిదే: సచిన్‌ | Sachin Tendulkar Lauds Rachin, Sarfraz: Exciting times ahead for both these | Sakshi
Sakshi News home page

Ind vs NZ: ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్‌ వీరిదే: సచిన్‌ ట్వీట్‌ వైరల్‌

Published Sat, Oct 19 2024 8:14 PM | Last Updated on Sat, Oct 19 2024 8:26 PM

Sachin Tendulkar Lauds Rachin, Sarfraz: Exciting times ahead for both these

టీమిండియా- న్యూజిలాండ్‌ తొలి టెస్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు బాగా హైలైట్‌ అయ్యారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన కివీస్‌ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర.. మరొకరు ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. బెంగళూరు టెస్టులో వీరిద్దరు సెంచరీలతో చెలరేగారు.

టీమిండియా పరువు నిలబెట్టిన సర్ఫరాజ్‌
కాగా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. ఇందులో సర్ఫరాజ్‌ సాధించిన పరుగులు సున్నా. అయితే, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగలిగిందంటే మాత్రం అందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్‌ ఖానే!

అద్భుత ఆట తీరుతో కివీస్‌ బౌలర్లపై అటాక్‌ చేస్తూ మెరుపు సెంచరీ సాధించిన ఈ ముంబైకర్‌.. 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్న వేళ అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం సాధించి ఆటగాడిగా తన విలువను చాటుకున్నాడు.

 

తండ్రి సొంతూరిలో కివీస్‌ తరఫున రచిన్‌ శతకం
మరోవైపు.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 91 పరుగులతో శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన రచిన్‌ రవీంద్ర శతక్కొట్టి జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరు వేదికగా టెస్టుల్లో రెండో సెంచరీ(157 బంతుల్లో 134) నమోదు చేశాడు. అతడికి తోడుగా టిమ్‌ సౌథీ(65) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 402 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.

ఎవరిది పైచేయి అవునో?!
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌కు 107 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. మరొక్కరోజు(ఆదివారం) మాత్రమే ఆట మిగిలి ఉండటంతో న్యూజిలాండ్‌ బ్యాటర్లు, భారత బౌలర్ల మధ్య పోటీలో ఎవరు నెగ్గుతారోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. బెంగళూరు సెంచరీ హీరోలు సర్ఫరాజ్‌ ఖాన్‌, రచిన్‌ రవీంద్రల గురించి టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్‌ వీరిదే
‘‘మన మూలాలను అనుసంధానం చేసే మార్గం క్రికెట్‌కు ఉంది. రచిన్‌ రవీంద్రకు బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అతడి కుటుంబం అక్కడి నుంచే వలస వెళ్లింది. అక్కడే అతడు శతకం బాదాడు.

ఇక సర్ఫరాజ్‌ ఖాన్‌... తన కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీ సాధించడానికి ఇంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది?! టీమిండియాకు అత్యవసరమైన వేళ అతడు శతకం బాదాడు. ప్రతిభావంతులైన ఈ ఇద్దరు యువకులు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలరు’’ అని సచిన్‌ టెండుల్కర్‌ రచిన్‌, సర్ఫరాజ్‌లపై ప్రశంసలు కురిపించాడు. 

చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్‌ ఆగ్రహం.. కోహ్లి ఆన్‌ ఫైర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement