
ఆసీస్‌తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో అయ్యర్ 53 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ తన బౌలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తనకు బౌలింగ్ చేయాలని ఆసక్తి ఉన్నప్పటికి వెన్ను గాయం కారణంగా దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. నాకు బౌలింగ్ చేయాలనే కోరిక ఉంది. కానీ ఫిట్‌నెస్ అండ్ మెంటల్ కండిషనింగ్ కోచ్ సలహా మెరకు ప్రస్తుతం బౌలింగ్ చేయడం లేదు. ఇది నిజంగా నాకు నిరాశ కలిగించిందని అయ్యర్ జియో సినిమాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
కాగా అయ్యర్ ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 45 బంతులు మాత్రమే బౌలింగ్ చేసాడు. ఒక్క వికెట్ కూడా తీయకుండా 43 పరుగులు ఇచ్చాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం శ్రేయస్‌కు 10 వికెట్లు ఉన్నాయి.
అయ్యర్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్దమవుతున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌కు ముందు జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కూడా అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. దాదాపు 6 నెలల పాటు గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న అయ్యర్ ఈ ఏడాది ఆసియాకప్‌తో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు.
చదవండి: IPL 2024: ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్!?