ఐపీఎల్ 2024 వేలం రేపు (డిసెంబర్ 19) దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ వేలం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ముందు ఇవాళ (డిసెంబర్ 18) అదే వేదికపై మాక్ ఆక్షన్ (డమ్మీ వేలం) జరిగింది. ఈ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.
ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ చిన్న సైజ్ యుద్దమే చేసింది. ఆ జట్టు ప్రతినిధి మైక్ హెస్సన్ స్టార్క్‌ను 18.5 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నాడు. మాక్ వేలంలో ఇదే అత్యధిక ధర.
స్టార్క్ తర్వాత సౌతాఫ్రికా యంగ్ గన్ గెరాల్డ్ కొయెట్జీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరికి కొయెట్జీని గుజరాత్ టైటాన్స్ 18 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరి తర్వాత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అంతిమంగా కమిన్స్‌ను 17.5 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
ఈ మాక్ ఆక్షన్‌లో ఎవరూ ఊహించని ధరకు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోయాడు. శార్దూల్‌ను పంజాబ్ కింగ్స్ 14 కోట్లకు దక్కించుకుంది. లంక పేసర్ దిల్షన్ మధుషంక, లంక స్పిన్నర్ వనిందు హసరంగ, ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్‌కప్ హీరో ట్రవిస్ హెడ్‌ల కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీపడ్డాయి. మధుషంకను కేకేఆర్ (10.5 కోట్లు), హ్యారీ బ్రూక్‌ను గుజరాత్ టైటాన్స్ ( 9.5 కోట్లు), హసరంగను (8.5 కోట్లు), ట్రవిస్ హెడ్‌లను (7 కోట్లు) సీఎస్‌కే దక్కించుకున్నాయి.
- మిచెల్ స్టార్క్- 18.5 కోట్లు (ఆర్సీబీ)
- గెరాల్డ్ కొయెట్జీ-18 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- పాట్ కమిన్స్- 17.5 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
- శార్దూల్ ఠాకూర్-14 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- దిల్షన్ మధుషంక-10.5 కోట్లు (కేకేఆర్)
- హ్యారీ బ్రూక్- 9.5 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- వనిందు హసరంగ-8.5 కోట్లు (సీఎస్‌కే)
- ట్రవిస్ హెడ్- 7 కోట్లు (సీఎస్‌కే)
కాగా, మాక్ వేలంలో లభించిన ధర డమ్మీ ధర అయినప్పటికీ.. పై పేర్కొన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. రేపు జరుగబోయే అధికారిక వేలంలో ఈ ఆటగాళ్లపై కనక వర్షం కురువడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరితో పాటు వరల్డ్‌కప్ హీరో, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు.
- ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023
- సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం)
- వేదిక: దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా
- ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ)
- డిజిటల్: జియో సినిమా
- మొత్తం స్లాట్‌లు: 77
- వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333
- భారతీయ ఆటగాళ్లు: 214
- విదేశీ ఆటగాళ్లు: 119
Comments
Please login to add a commentAdd a comment