ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్‌స్మిత్ ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ సమయంలో చిరిగిన టోపీతో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతూ ఇలా చిరిగిన టోపీని ధరించడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు వెస్టిండీస్‌పై విజయం తర్వాత ట్రోఫీని అందుకునే సమయంలోనూ స్మిత్ అదే చిల్లుపడిన క్యాప్ పెట్టుకొని రావడం ఆసక్తి కలిగింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయంతో రెండో టెస్టుకు దూరమవడంతో వైస్ కెప్టెన్ అయిన స్మిత్ స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండో టెస్టులో 419 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకుంది.
తాజాగా స్మిత్ చిరిగిపోయిన టోపీ గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.'' డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పటిలాగే నా టోపీ పెట్టి వెళ్లిపోయాను. తర్వాతి రోజు వచ్చి చూద్దును కదా... ఎలుకలు దూరినట్టున్నాయి. అందుకే ఈ టోపీ ఇలా తయారైంది. వచ్చే వారం దీనిని బాగు చేయిస్తాను.అంతేకానీ పడేయను అంటూ చెప్పుకొచ్చాడు . 2010లో అంతర్జాతీయ టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన స్టీవ్ స్మిత్ అప్పటినుంచి అదే క్యాప్‌ను వాడుతూ వస్తున్నాడు. అలా 12 ఏళ్ల నుంచి క్యాప్ పెట్టుకుంటున్న స్మిత్ దాన్ని ఎంతో అపరూపంగా చూసుకుంటూ వచ్చాడు. తాజాగా ఎలుకలు తనకిష్టమైన క్యాప్‌ను కొరికేయడంతో వాటిపై కోపంతో చిరిగిన క్యాప్‌ను ధరించి నిరసన వ్యక్తం చేశాడు.
ఇక వెస్టిండీస్ టూర్‌లో స్మిత్ నుంచి మంచి ప్రదర్శన వచ్చింది. తొలి టెస్టులో 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే కెప్టెన్‌గా ఆడిన రెండో టెస్టులో మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. విండీస్‌తో సిరీస్ ముగించుకున్న ఆస్ట్రేలియా స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడబోతోంది.
స్వదేశంలో జరగనున్న మూడు టెస్టుల సిరీస్.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ చేరే జట్లపై స్పష్టత తీసుకురానుంది. సౌతాఫ్రికాను స్వదేశంలో ఆస్ట్రేలియా 2-0 లేదా 3-0 తేడాతో ఓడించగలిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఒకవేళ సౌతాఫ్రికా..ఆస్ట్రేలియాని ఓడిస్తే మాత్రం పోరు రసవత్తరంగా మారనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా టాప్‌లోకి చేరుకుంటుంది. దీంతో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక, నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా ఛాన్సులు మెరగవుతాయి.
చదవండి: కోహ్లి కోసం తపిస్తున్న పాక్ అభిమానులు.. ఇది చూడండి..!
Comments
Please login to add a commentAdd a comment