Suresh Raina Restaurant: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్ ఆరంభించాడు. యూరప్ నడిబొడ్డున భారత రుచులను కస్టమర్లకు వడ్డించేందుకు సిద్ధమైపోయాడు.
రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా చెఫ్ అవతారమెత్తాడు ఈ మిస్టర్ ఐపీఎల్. ‘రైనా’ పేరిట మొదలెట్టిన రెస్టారెంట్ ముందు నిలబడి తమ ఉద్యోగులతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
సరికొత్త రుచులు
‘‘ఇంతకు ముందెన్నడూ రుచి చూడని వంటకాలతో మేము సిద్ధం. రుచి చూసేందుకు మీరూ సిద్ధంకండి. ఆమ్‌స్టర్‌డామ్‌లో రైనా ఇండియన్ రెస్టారెంట్ మొదలెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఫుడ్ పట్ల నాకున్న ప్యాషన్ ఇక్కడ మీరు చూడబోతున్నారు’’ అని సురేశ్ రైనా తన పోస్టులో చెప్పుకొచ్చాడు.
నోరూరించే వెరైటీలు
తమ రెస్టారెంట్‌లో ఉత్తర భారత వంటల సువాసనలతో పాటు.. దక్షిణ భారత అదిరిపోయే రుచులను కూడా అందిస్తామని రైనా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా రైనా రెస్టారెంట్‌లో చికెన్ చాట్, మిక్స్ పకోడా, జైతుని పనీర్ టిక్కా, తందూర్ చికెన్ టిక్కా, ఆనియన్ భాజీతో పాటు పలురకాల కెబాబ్స్ స్టార్టర్లుగా వడ్డించనున్నారు.
అదే విధంగా ఢిల్లీలోని చాందినీచౌక్‌లో ప్రసిద్ధి పొందిన దహీ భల్లా, పానీ పూరీ, చాట్ పాప్రీ, ఆలూ చాట్, సమోసా కూడా వీరి మెనూలో ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్ సహా వెజ్‌టేరియన్ వెరైటీలతో కస్టమర్లను ఆకర్షించేందుకు రైనా రెస్టారెంట్ సిద్ధమైపోయింది.
భార్య బ్యాంకర్‌గా
కాగా సురేశ్ రైనా భార్య ప్రియాంక గతంలో నెదర్లాండ్స్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా తరచుగా ఆమ్‌స్టర్‌డామ్ వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడే రెస్టారెంట్ ఆరంభించి తన కలను నిజం చేసుకున్నాడు. ఇక తాను ఫుడీనంటూ గతంలో రైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
చిన్న తలా కెరీర్ ఇలా
ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడిన రైనా.. వరుసగా 768, 5615, 1604 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. చిన్న తలాగా పేరొందాడు. మహేంద్ర సింగ్ ధోనికి అత్యంత సన్నిహితుడైన రైనా.. మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంటనే తానూ గుడ్ చెప్పాడు. 2020 ఆగష్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు.
చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్
Comments
Please login to add a commentAdd a comment