అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అనుకున్నంత మెరుపులు లేవు.. భారీ హిట్టింగ్‌లు లేవు.. కానీ ముంబై ఖాతాలో విజయం చేరిందంటే దానికి ప్రధాన కారణం సూర్య కుమార్ యాదవ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్‌సీబీ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ముంబై చేధించడంలో సింహబాగం సూర్య ఆడిన ఇన్నింగ్స్ నుంచి వచ్చినవే అని చెప్పొచ్చు. 43 బంతుల్లో 79 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ ఆడి ముంబైని ఒంటిచేత్తో ప్లేఆఫ్‌కు చేర్చాడు. సూర్యకుమార్ ఆడిన ఇన్నింగ్స్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.. అదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ స్పందించాడు. (చదవండి : సూర్యకుమార్‌పై ప్రశంసలు.. కాస్త ఓపిక పట్టు!)
'ఈరోజు సూర్యకుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతనిలో ఉన్న నైపుణ్యతకు ఎప్పుడో టీమిండియాలో అడుగుపెట్టాల్సింది. అయితే తాజాగా ఆసీస్ పర్యటనకు సూర్యను ఎంపిక చేయకపోవడం పట్ల అతను తీవ్ర నిరాశ చెంది ఉంటాడు. ఒక కుర్రాడు మూడో స్థానంలో వచ్చి అలాంటి స్ట్రైక్‌రేట్‌తో ఆడడం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటరిపోరాటం చేశాడు. అతను నిలకడగా ఆడటమే మాకు చేసే అత్యంత మేలు. ఒక ఆటగాడిగా ఇలా నిలకడగా ఆడుతుంటే రివార్డులు వాటంతట అవే వస్తాయి. నేనేం చేయాలని జట్టు ఆశిస్తుందో అదే చేస్తాను. జట్టు బాగా ఆడితే సంతోషంగా ఉంటా.' అంటూ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. (చదవండి : సూర్య ప్రతాపం.. ప్లేఆఫ్స్‌కు ముంబై)
వాస్తవానికి గత రెండేళ్లుగా సూర్యకుమార్ యాదవ్ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒక అనామక ప్లేయర్‌గా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు వచ్చిన తర్వాత బాగా రాటుదేలాడు. 2018 నుంచి ముంబై తరపున ఐపీఎల్‌లో ఆడుతున్న అతను మంచి ప్రదర్శన కనబరిచాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన కోసం టీ20 సిరీస్‌కు సూర్య పేరును పరిగణలోకి తీసుకుంటారని అంతా భావించారు. కానీ సూర్యను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఇదేమి పట్టించుకోని సూర్యకుమార్ తన ఆట తను ఆడాడు. ఏదో ఒకరోజు టీమిండియా జట్టులోకి పిలుపు వస్తుందని అతను ఆశతో ఉన్నాడు. సూర్య కుమార్ ఆశ త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment