పొలార్డ్‌ బ్యాగ్‌లు సర్దుకోమన్నాడు: బ్రేవో | Pollard Texted Me, Pack Your Bags,Bravo Recalls | Sakshi
Sakshi News home page

పొలార్డ్‌ బ్యాగ్‌లు సర్దుకోమన్నాడు: బ్రేవో

Published Fri, Oct 23 2020 5:28 PM | Last Updated on Sat, Oct 24 2020 6:41 PM

Pollard Texted Me, Pack Your Bags,Bravo Recalls - Sakshi

పొలార్డ్‌-బ్రేవో(ఫైల్‌ఫోటో)

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌ నుంచి సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో వైదొలిగిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా టోర్నీ మధ్య నుంచి బ్రేవో తప్పుకున్నాడు. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమైన బ్రేవో.. ఈ టోర్నీలో పూర్తిగా ఆస్వాదించుకుండానే తప్పుకున్నాడు. సీఎస్‌కేది కూడా దాదాపు నిష్ర్కమించే పరిస్థితి. ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఏడింట ఓటమి చూసింది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉండటంతో సీఎస్‌కే వాటిలో విజయం సాధించినా ప్లేఆఫ్స్‌కు చేరడం అసాధ్యం. (ఆరుసార్లు ఆర్చర్‌కే దొరికేశాడు..!)

ముంబై ఇండియన్స్‌తో ఈరోజు సీఎస్‌కే రెండో అంచె మ్యాచ్‌ జరుగనుంది. తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించగా, రెండో అంచె మ్యాచ్‌లో ముంబై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే  కొన్ని విషయాలను స్టార్‌ స్పోర్ట్స్‌ చాట్‌ షోలో బ్రేవో పంచుకున్నాడు. దాదాపు ఏడేళ్ల నాటి ఘటనను బ్రేవో గుర్తు చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో  జరిగిన ఫైనల్‌ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకోగా, సీఎస్‌కే రన్నరప్‌గా సరిపెట్టుకుంది. అయితే ఆ మ్యాచ్‌కు ముందు తనను ముంబై ఇండియన్స్‌ ఆల్‌ రౌండర్‌ కీరోన్‌ పొలార్డ్‌ తనను టీజ్‌ చేశాడని బ్రేవో చెప్పుకొచ్చాడు.

‘పొలార్డ్‌ అప్పుడు ఒక వాట్సాప్‌ మెసేజ్‌ పంపాడు. ఇక మీ బ్యాగ్‌లు సర్దుకోండి అని టెక్స్ట్‌ మెసేజ్‌ చేశాడు. మీరు ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి’ అని అన్నాడు. దానికి ఓకే అని రిప్లే ఇవ్వడమే కాకుండా ప్రొబ్లమ్‌ ఏమీ లేదని  తిరిగి మెసేజ్‌ చేశానన్నాడు. ప్లేఆఫ్‌లో ముంబైపై గెలిచి సీఎస్‌కే ఫైనల్‌కు క్వాలిఫై అయిన విషయాన్ని ప్రస్తావించిన బ్రేవో.. ఎవరు ఇంటికి వెళతారో చూద్దాం అని పొలార్డ్‌కు రిప్లే ఇచ్చానన్నాడు. 2013 ఫైనల్‌ అనేది నిజంగా ఒక గొప్ప మ్యాచ్‌ అని బ్రేవో తెలిపాడు. అప్పటివరకూ ముంబైని తాము ఓడిస్తూ వస్తే, అప్పుడు వారు తమపై గెలిచి సంతృప్తి చెందారన్నాడు. అప్పట్నుంచి ఇరుజట్ల మధ్య ఎప్పుడు పోరు జరిగినా ఆసక్తికరంగానే ఉంటుందన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement