
Bangladesh Player Mohammad Saifuddin Ruled Out Of T20 WC 2021: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెన్నెముకకు గాయమైన నేపథ్యంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో పేసర్ రూబెల్ హుస్సేన్ 15 మంది సభ్యులతో కూడిన జట్టులో చేరనున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ ధ్రువీకరించింది.
గాయం కారణంగా 24 ఏళ్ల సైఫుద్దీన్ జట్టుకు దూరమైన నేపథ్యంలో మార్పునకు అంగీకరించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది. ఈ మేరకు... క్రిస్ టెట్లే(ఈవెంట్స్ హెడ్), క్లీవ్ హిచ్‌కాక్(ఐసీసీ సీనియర్ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్), బీసీసీఐ ప్రతినిధులు రాహుల్ ద్రవిడ్, ధీరజ్ మల్హోత్రా, స్వతంత్ర సభ్యులు సిమన్ డౌల్, ఇయాన్ బిషప్‌లతో కూడిన ఈవెంట్ టెక్నికల్ కమిటీ మంగళవారం ఇందుకు సమ్మతం తెలిపినట్లు పేర్కొంది.
ఐదు వికెట్లు పడగొట్టాడు
సైఫుద్దీన్ టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో నాలుగు మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సైఫుద్దీన్ గాయపడటంతో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న రూబెల్ హుస్సేన్‌కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. ఇక సూపర్-12లో భాగంగా ఇంగ్లండ్‌తో బుధవారం మ్యాచ్ నేపథ్యంలో బంగ్లా తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కుతుందా లేదా అన్నది అనుమానమే. సైఫుద్దీన్ స్థానంలో టస్కిన్ అహ్మద్‌ను ఆడించే అవకాశం ఉంది.
చదవండి: Quinton De Kock: నేను అలా చేయలేను; అతడేం చిన్నపిల్లాడు కాదు: కెప్టెన్