T20 World Cup 2021 Ind Vs Auf: India Beat Afghanistan By 66 Runs Hope Semis Chances - Sakshi
Sakshi News home page

T20 WC 2021 IND Vs AFG: ఎట్టకేలకు గెలిచాం.. ఆపై నిలిచాం

Published Thu, Nov 4 2021 7:36 AM | Last Updated on Thu, Nov 4 2021 2:24 PM

T20 World Cup 2021: India Beat Afghanistan By 66 Runs Hope Semis Chances - Sakshi

ఎట్టకేలకు ప్రపంచకప్‌లో మన మెరుపులు మెరిశాయ్‌. మైదానంలో 4, 6 బోర్డులు లేచాయ్‌. ఓపెనింగ్‌ దంచేసింది. బ్యాటింగ్‌ క్లాస్‌ తిరిగొచ్చింది. ‘పవర్‌’ పరుగెత్తించింది. స్కోరు హోరెత్తింది. అటు బౌలింగ్‌ కూడా బెబ్బులిగా గర్జించింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై పంజా విసిరింది. దీంతో అబుదాబిలో మన జెండా దీపావళి పండగ చేసుకుంది.

అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శనతో భారత్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఫ్లాప్‌ అయిన బ్యాటింగ్‌ ఒక్కసారిగా ‘సూపర్‌ హిట్‌’ అయ్యింది. పసలేని బౌలింగ్‌ ‘పవర్‌ఫుల్‌’గా మారింది. బుధవారం గ్రూప్‌–2లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రతాపంతో 66 పరుగులతో నెగ్గింది. మళ్లీ టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (47 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (48 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. రిషభ్‌ పంత్‌ (13 బంతుల్లో 27 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 35 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. తర్వాత అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులే చేసి ఓడింది. కరీమ్‌ జనత్‌ (22 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ నబీ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడారు. రేపు జరిగే గ్రూప్‌–2 మ్యాచ్‌ల్లో నమీబియాతో న్యూజిలాండ్‌ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... స్కాట్లాండ్‌తో భారత్‌ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. రన్‌రేట్‌ మరింత మెరుగుపడాలంటే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.  

రోహిత్, రాహుల్‌ ఫిఫ్టీ–ఫిఫ్టీ 
మన ఓపెనింగ్‌ ధాటి తొలి ఓవర్లోనే మొదలైంది. స్పిన్నర్‌ నబీ తొలి ఓవర్‌ ఆఖరి బంతిని రోహిత్‌ బౌండరీకి తరలించాడు. అష్రఫ్‌ రెండో ఓవర్లో రోహిత్‌ ఒక ఫోర్, రాహుల్‌ వరుసగా 6, 4 కొట్టడంతో 16 పరుగులొచ్చాయి. బౌలర్లను మార్చి నవీన్‌ ఉల్‌ హఖ్, హమీద్‌ హసన్‌లతో 3, 4 ఓవర్లను వేయించినా ఫలితం, ఓపెనర్ల దూకుడు మారలేదు. 5వ ఓవర్లోనే జట్టు స్కోరు 50 దాటింది. నవీన్‌ వేసిన ఆ ఓవర్లో 16 పరుగులు రాగా, రోహిత్‌ 37 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్‌) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరుసటి ఓవర్లో రాహుల్‌ 35 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. రషీద్‌ ఖాన్‌కు వరుస బంతుల్లో 6, 6, చుక్కలు చూపించిన రోహిత్, కాసేపటికే రాహుల్‌ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 

విరుచుకుపడిన పంత్, పాండ్యా 
కోహ్లి తాను రాకుండా రిషభ్‌ పంత్‌ను పంపాడు. తర్వాత హార్దిక్‌ పాండ్యా జతవ్వగా స్కోరు హోరెత్తింది. ఇద్దరు అదే పనిగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. గుల్బదిన్‌ బౌలింగ్‌లో పంత్‌ కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టాడు. ఈ జోడీ కేవలం 3.3 ఓవర్లలోనే 63 పరుగులు చేయడం విశేషం. 

వికెట్లు టపటపా... 
రెండు మ్యాచ్‌లాడినా రెండే వికెట్లు తీసిన దైన్యం భారత బౌలింగ్‌ది. ఈ మసక నుంచి తొందరగానే బయటపడింది. అఫ్గానిస్తాన్‌ను మన బ్యాటే కాదు బంతి కూడా శాసించింది. ఓపెనర్‌ షహజాద్‌ (0)ను షమీ డకౌట్‌ చేయగా, హజ్రతుల్లా (13)ను బుమ్రా కట్టడి చేశాడు. తర్వాత స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా రంగంలోకి దిగి వికెట్లను చక్కబెట్టడంతో అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ కుదేలైంది. అఫ్గాన్‌ 69 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. కెప్టెన్‌ నబీ, కరీమ్‌ జనత్‌ జోడీ కాసేపు నిలబడటంతో జట్టు స్కోరు వంద దాటింది. కొండంత లక్ష్యం కరిగించేందుకు దిగిన ప్రత్యర్థి బ్యాట్స్‌ మెన్‌ను భారత బౌలర్లు వణికించారు.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) గుల్బదిన్‌ 69; రోహిత్‌ శర్మ (సి) నబీ (బి) కరీమ్‌ 74; పంత్‌ (నాటౌట్‌) 27; హార్దిక్‌ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–140, 2–147. బౌలింగ్‌: నబీ 1–0– 7–0, అష్రఫ్‌ 2–0–25–0, నవీన్‌ 4–0–59– 0, హమీద్‌ 4–0–34–0, గుల్బదిన్‌ 4–0–39–1, రషీద్‌ 4–0–36–0, కరీమ్‌ జనత్‌ 1–0–7–1. 

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: హజ్రతుల్లా (సి) శార్దుల్‌ (బి) బుమ్రా 13; షహజాద్‌ (సి) అశ్విన్‌ (బి) షమీ 0; రహ్మానుల్లా (సి) పాండ్యా (బి) జడేజా 19; గుల్బదిన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 18; నజీబుల్లా (బి) అశ్విన్‌ 11; నబీ (సి) జడేజా (బి) షమీ 35; కరీమ్‌ (నాటౌట్‌) 42; రషీద్‌ ఖాన్‌ (సి) పాండ్యా (బి) షమీ 0; అష్రఫ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–48, 4–59, 5–69, 6–126, 7–127. బౌలింగ్‌: షమీ 4–0– 32–3, బుమ్రా 4–0–25–1, హార్దిక్‌ 2–0–23–0, జడేజా 3–0–19–1, అశ్విన్‌ 4–0–14–2, శార్దుల్‌ 3–0–31–0.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement