మహ్మద్ రిజ్వాన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో విజయంతో మాజీ చాంపియన్ పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గ్రూప్–2లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ బృందం 45 పరుగుల తేడాతో క్రికెట్ కూన నమీబియాపై జయభేరి మోగించి ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఐదోసారి సెమీఫైనల్‌కు చేరింది. మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ రిజ్వాన్ (50 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ అజమ్ (49 బంతుల్లో 70; 7 ఫోర్లు) చెలరేగారు. మొదట నింపాదిగా ఆడిన ఈ ఓపెనర్లు తర్వాత దంచేశారు. జట్టు స్కోరు తొమ్మిదో ఓవర్లో 50 పరుగులకు చేరింది. తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడటంతో కేవలం 4 ఓవర్ల వ్యవధిలో 13వ ఓవర్లో పాక్ 100 పరుగులను అధిగమించింది. ఈ క్రమంలో బాబర్ (39 బంతుల్లో; 5 ఫోర్లు), రిజ్వాన్ (42 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీలు పూర్తిచేసుకున్నారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 14.2 ఓవర్లలో 113 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. వన్‌డౌన్‌లో ఫఖర్ జమన్ (5) విఫలమవ్వగా.... ఆఖర్లో హఫీజ్ (16 బంతుల్లో 32 నాటౌట్; 5 ఫోర్లు) ధాటిగా ఆడాడు.
అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసి ఓడింది. డేవిడ్ వీస్ (31 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), క్రెయిగ్ విలియమ్స్ (37 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఓపెనర్ స్టీఫెన్ బార్డ్ (29; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఇమద్, రవూఫ్, షాదాబ్ తలా ఒక వికెట్ తీశారు.
►టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా ఐదుసార్లు సెమీఫైనల్ దశకు చేరుకున్న తొలి జట్టుగా పాకిస్తాన్ ఘనత వహించింది. 2007లో రన్నరప్ గా నిలిచిన పాక్... 2009లో చాంపియన్ అయ్యింది. 2010, 2012లలో సెమీస్‌లో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment