సాక్షి క్రీడావిభాగం: కార్లోస్ బ్రాత్‌వైట్... రిమెంబర్ ద నేమ్..! గత టి20 ప్రపంచకప్‌లో చివరి ఘట్టం మీకు గుర్తుందా? ఇంగ్లండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో విజయం కోసం ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా, బ్రాత్‌వైట్ నాలుగు వరుస సిక్సర్లతో చెలరేగడంతో విండీస్ ఆటగాళ్ల వీర సంబరం... ఓవర్ వేసిన బెన్ స్టోక్స్‌కు ఓదార్పు! ఇది జరిగి ఐదున్నర ఏళ్లు దాటింది. లెక్క ప్రకారం రెండేళ్లకు ఒకసారి టి20 ప్రపంచకప్ నిర్వహించాల్సి ఉన్నా... ఐసీసీ సర్దుబాట్లలో భాగంగా 2016 టోర్నీ తర్వాత 2020లో జరగాలి.
కానీ ప్రపంచం మొత్తం కోవిడ్ గుప్పిట్లోకి చేరడంతో అలా తేదీలు మారుతూ వచ్చాయి. ఈ ఐదున్నరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టి20 లీగ్ టోరీ్నలు జరిగాయి. అభిమానులు ఆనందంగా వాటిని ఆస్వాదించారు కూడా. అయితే ప్రపంచకప్ అంటే ప్రపంచకప్పే! ధనాధన్ ఆటలో జాతీయ జట్టుకు మద్దతు పలుకుతూ ప్రదర్శించే ఉత్సాహం, ఉద్వేగానికి ఏ ఫ్రాంచైజీ క్రికెట్ సాటి రాదు! ఇప్పుడు ఆ సమయం మళ్లీ వచ్చేసింది. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న టి20 ప్రపంచ కప్‌కు నేటితో తెర లేవనుంది.
విరామం లేదు మిత్రమా... ఒక ధనాధన్ పరుగుల పండగ అలా శుక్రవారం ముగిసిందో లేదో... ఆదివారం నుంచి మరో మెరుపుల వేడుకకు రంగం సిద్ధమైంది. విధ్వంసక ఆటగాళ్లతో కూడిన వెస్టిండీస్ టైటిల్ నిలబెట్టుకొని మూడోసారి విజేతగా అవతరిస్తుందా? వన్డే వరల్డ్‌కప్ గెలిపించిన కెప్టెన్ మోర్గాన్ టి20 టోర్నీనీ అందించి ఇంగ్లండ్ హీరోగా నిలుస్తాడా? ప్రపంచ క్రికెట్‌ను సుదీర్ఘ కాలం శాసించినా ఇప్పటికీ అందకుండా ఊరిస్తున్న ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుచుకుంటుందా? విలియమ్సన్ ఒకే ఏడాది రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన తొలి కెపె్టన్‌గా అవతరిస్తాడా? దక్షిణాఫ్రికా ఇప్పటికైనా వరల్డ్‌కప్ గెలవగలదా? సొంత గడ్డలాంటి తమకు అచ్చి వచి్చన పిచ్‌లపై మాజీ చాంపియన్ పాకిస్తాన్ ప్రతాపం చూపిస్తుందా? అన్నింటికి మించి మన టీమిండియా అంతులేని ఆనందాన్ని పంచుతుందా...? వీటన్నింటికి వచ్చే నెల రోజుల్లో సమాధానం లభిస్తుంది.
ఐపీఎల్ వినోదం ముగిసిన వెంటనే ప్రపంచకప్ రూపంలో మరో మహా సంగ్రామానికి ఆటగాళ్లు, అభిమానులు అంతా సన్నద్ధమయ్యారు. ముందుగా కొన్ని అర్హతా సమరాలతో మొదలు పెట్టి వచ్చే శనివారం నుంచి అసలు ఆట షురూ కానుంది. దుబాయ్‌లో నవంబర్ 14న జరిగే ఫైనల్‌తో టోర్నమెంట్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచకప్ విశేషాలతో... 2016 టి20 ప్రపంచ కప్ ఆడిన వారిలో కోహ్లి, రోహిత్, అశ్విన్, బుమ్రా, జడేజా, షమీ, హార్దిక్ (ఏడుగురు) ప్రస్తుత జట్టులోనూ ఉన్నారు.
టోర్నీ ఫార్మాట్
ర్యాంకింగ్ ప్రకారం భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ (8 జట్లు) నేరుగా అర్హత సాధించాయి. రౌండ్–1 లో క్వాలిఫయింగ్ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా (గ్రూప్–ఎ) ... బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్ ,పాపువా న్యూగినియా (గ్రూప్–బి) రెండు గ్రూప్‌లుగా విడిపోయి అర్హత మ్యాచ్‌లు ఆడనున్నాయి. రెండు గ్రూప్‌లలో టాప్–2లో నిలిచిన నాలుగు జట్లు మిగిలిన 8 టీమ్‌లతో కలిసి ఈనెల 23 నుంచి ‘సూపర్–12’లో పోటీ పడతాయి. ఇక్కడా 12 జట్లను గ్రూప్–1, గ్రూప్ –2లుగా విభజించారు. తమ గ్రూప్ లోని మిగిలిన ఐదు జట్లతో మ్యాచ్‌లు ఆడిన అనంతరం రెండు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి.
భారత్‌దే ఆతిథ్యం...
పేరుకు విదేశంలో జరుగుతున్నా... అధికారికంగా ఈ ప్రపంచకప్ నిర్వాహక హక్కులు భారత్ వద్దే ఉన్నాయి. టోర్నీ నిర్వహణ మొత్తం బీసీసీఐ ఆధ్వర్యంలోనే సాగుతుంది. టీమ్ జెర్సీలపై కూడా ‘టి20 వరల్డ్‌కప్, భారత్–2021’ అనే ఉంటుంది. మ్యాచ్‌లు మస్కట్‌లోని అల్–అమీరత్ గ్రౌండ్‌లో... యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాల్లో నిర్వహిస్తారు.
‘డీఆర్‌ఎస్’ తొలిసారి...
2016లో ప్రపంచకప్ జరిగినప్పుడు టి20ల్లో డీఆర్‌ఎస్ పద్ధతి లేదు. ఇప్పుడు తొలిసారి మెగా ఈవెంట్‌లో డీఆర్‌ఎస్‌ను ఉపయోగించనున్నారు. ఒక్కో ఇన్నింగ్స్‌లో జట్టుకు రెండు రివ్యూ అవకాశాలు ఉంటాయి.
150 సెకన్ల విరామం...
వరల్డ్‌కప్‌లో తొలిసారి ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో ఇన్నింగ్స్‌లో 2 నిమిషాల 30 సెకన్ల పాటు డ్రింక్స్ బ్రేక్ ఇస్తున్నారు. ఇది సరిగ్గా 10 ఓవర్ల తర్వాతే ఉంటుంది.
రిజర్వ్ డే...
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే ‘రిజర్వ్ డే’లు ఉన్నాయి. ఒక్కో ఇన్నింగ్స్ కనీసం 5 ఓవర్లు సాగినా ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ ద్వారా నిర్ధారించడం ఇప్పటి వరకు టి20ల్లో నిబంధన. అయితే తొలిసారి ఐసీసీ స్వల్ప మార్పు చేసింది. ఈ టోర్నీ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల్లో మాత్రం ఒక్కో జట్టు కనీసం 10 ఓవర్లు ఆడితే డక్‌వర్త్ లూయిస్‌ను అమలు చేస్తారు.
మ్యాచ్ ‘టై’ అయితే...
మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అందులోనూ సమంగా నిలిస్తే ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్లు ఆడిస్తారు. ఫైనల్లో ఏదైనా కారణం చేత సూపర్ ఓవర్లలోనూ ఫలి తం రాకపోతే సంయుక్తవిజేతగా ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment