ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్‌లో తొలి మ్యాచే కఠిన ప్రత్యర్థితో ఎదురై అందులో అద్భుత విజయం సాధిస్తే ఇక తర్వాతి మ్యాచ్‌లకు తిరుగేముంటుంది? ఇకపై జరిగే మ్యాచ్‌లన్నీ సులువుగానే అనిపిస్తాయి. ప్రస్తుతం భారత జట్టు సరిగ్గా అలాంటి స్థితిలోనే ఉంది. పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత రెండో పోరులో ఒక అసోసియేట్ టీమ్‌ను జట్టు ఎదుర్కోబోతోంది. గెలుపు విషయంలో ఎలాంటి సందేహాలు లేకున్నా టీమిండియా ఎలా ఆధిక్యం ప్రదర్శించనుందో, నెదర్లాండ్స్ ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి.
సిడ్నీ: అంతర్జాతీయ టి20ల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తలపడని భారత్, నెదర్లాండ్స్ తొలి సమరానికి సన్నద్ధమయ్యాయి. ఈ పోరుకు వరల్డ్‌కప్ వేదిక అవుతోంది. ‘గ్రూప్–2’లో పాక్‌ను ఓడించిన భారత్ సమరోత్సాహంతో ఉండగా, శ్రీలంక చేతిలో ఓడిన నెదర్లాండ్స్ తమ ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బలాబలాల దృష్ట్యా చూస్తే రోహిత్ సేన సహజంగానే ఫేవరెట్ కాగా, బుధవారం ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ ప్రదర్శన చూస్తే ఏమాత్రం అలసత్వం దరి చేరనీయకుండా ఉండటం కూడా ముఖ్యం.
అదే జట్టుతో...
పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ చూశాక అతని ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బలహీన బౌలింగ్ ఉన్న నెదర్లాండ్స్‌పై అతను చెలరేగితే మరెన్నో రికార్డులు ఖాయం. అయితే టాప్–4లో మరో ముగ్గురు ఆటగాళ్లకు ఈ మ్యాచ్ ద్వారా తగినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ అవసరం ఉంది. ఓపెనర్లుగా వరుసగా విఫలమవుతున్న రోహిత్, రాహుల్‌లతో పాటు సూర్యకుమార్ కూడా లయ అందుకోవాల్సి ఉంది.
గత ఐదు టి20ల్లో కలిపి రోహిత్ 64 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫామ్ అందుకోవడం జట్టుకు ఎంతో అవసరం. చిన్న జట్టుపైనైనా రాహుల్ తన ముద్ర వేస్తాడా చూడాలి. తర్వాతి స్థానాల్లో హార్దిక్, దినేశ్ కార్తీక్ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలరు. కాబట్టి ఆందోళన లేదు. పాక్‌తో మ్యాచ్‌లో అక్షర్‌ను ముందుగా పంపించినా, ఈసారి అలాంటి అవసరం ఉండకపోవచ్చు.
బౌలింగ్‌లో కూడా భారత్ జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని కోచ్ పారస్ మాంబ్రే చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. డచ్ టీమ్ టాప్–8లో ఒక్కరూ ఎడంచేతివాటం బ్యాటర్ లేరు కాబట్టి అశ్విన్‌కంటే లెగ్‌స్పిన్నర్ చహల్ మెరుగైన ప్రత్యామ్నాయం అనిపించింది. అయితే గెలిచిన జట్టులో మార్పులు ఉండబోవని స్పష్టమైంది. ముగ్గురు పేసర్లు షమీ, భువనేశ్వర్, అర్‡్షదీప్ పెద్దగా అనుభవం లేని డచ్ బ్యాటర్లను ఇబ్బంది పెడితే ఆరంభంలోనే భారత్‌కు పట్టు చిక్కుతుంది.
డి లీడ్‌పై దృష్టి...
ఈ ప్రపంచకప్ ‘సూపర్ 12’లో ఆడుతున్న ఏకైక అసోసియేట్ జట్టు నెదర్లాండ్స్. దాంతో చాలా కాలం తర్వాత వారికి పెద్ద జట్లను ఎదుర్కొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలో భారత్‌తో పోరులో డచ్ బృందం తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. 2022లో ఎక్కువ సంఖ్యలో టి20 మ్యాచ్‌లు ఆడి వరల్డ్ కప్‌లోకి అడుగుపెట్టింది. రెండు అనవసర రనౌట్‌లు లేకపోతే తొలి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించేది కూడా! మ్యాక్స్ ఒ డౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, అకర్‌మన్, టామ్ కూపర్ ఆ జట్టులో కీలక ఆటగాళ్లు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ముందుండి స్ఫూర్తిదాయకంగా జట్టును నడిపిస్తున్నాడు.
ప్రధాన బౌలర్ మీర్‌కెరెన్ ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం. దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్‌పై కూడా అందరి దృష్టీ ఉంది. క్వాలిఫయింగ్ సమరంలో రెండు సార్లు జట్టును గెలిపించి అతను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. గతంలో దక్షిణాఫ్రికాతో పాటు ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున ఆడిన వాన్ డర్ మెర్వ్ గాయం నుంచి కోలుకోకపోతే షారిజ్ అహ్మద్‌కు చోటు దక్కుతుంది. 2009, 2014 టి20 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్‌ను ఓడించిన రికార్డు నెదర్లాండ్స్‌కు ఉంది.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 200 పరుగులు చేసింది. ప్రస్తుతం సిడ్నీలో స్వల్ప వర్షం ఉన్నా... మ్యాచ్ రోజు ఎలాంటి అంతరాయం ఉండదని వాతావరణ శాఖ సమాచారం.
T20 World Cup 2022: నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ.. కోహ్లి మళ్లీ మెరుస్తాడా?
Published Thu, Oct 27 2022 4:24 AM | Last Updated on Thu, Oct 27 2022 8:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment