టీ20 వరల్డ్ కప్-2022 సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే అన్ని జట్లను గాయల సమస్య వేధిస్తుంది. శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్.. ఇలా దాదాపు ప్రతి జట్టులో ఎవరో ఒకరు గాయాల బారిన పడుతూ ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ జాబితాలోకి చేరింది. ఆ జట్టు సెకెండ్ వికెట్‌కీపర్ జోష్ ఇంగ్లిస్.. ఇవాళ ఉదయం గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు.
అతని గాయం తీవ్రమైంది కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని స్థానిక మీడియా వెల్లడించింది. ఇంగ్లిస్ గాయం బారిన పడటంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా స్పేర్ వికెట్‌కీపర్ లేకుండానే ప్రపంచకప్ బరిలోకి దిగనుంది. 15 మంది సభ్యులు గల ఆసీస్ టీమ్‌లో మాథ్యూ వేడ్ రెగ్యులర్ వికెట్‌కీపర్‌గా ఉన్నాడు. ఇంగ్లిస్ జట్టుకు దూరమైతే వేడ్‌పై అదనపు భారం పడుతుంది.
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా.. అక్టోబర్ 22న తమ సూపర్ 12 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా.. మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే గాయాల బెడద, వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓటమి ఆ జట్టును కలవరపెడుతున్నాయి. మరోవైపు భారత్.. తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో అక్టోబర్ 23న తలపడనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment