న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో తదుపరి మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ గురించి క్రీడావర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వివిధ జట్ల బలాలు, బలహీనతలను అంచనా వేస్తూ దిగ్గజ క్రికెటర్లు, కామెంటేటర్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష బోగ్లే టీ20 ప్రపంచకప్‌నకై తన టీమిండియా జట్టును ప్రకటించాడు. తన స్క్వాడ్‌లో భారత ఐదుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌కు చోటిచ్చిన హర్ష... వెటరన్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను మాత్రం విస్మరించాడు.
ఇక భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లతో పాటు.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి కొత్త ఆటగాళ్లకు కూడా తన జట్టులో చోటు ఉందని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే... హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులోఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోగా.. కరోనా కలకలం నేపథ్యంలో వరుస ఓటములతో టీ20 సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
హర్షా బోగ్లే టీ20 వరల్డ్ కప్ భారత జట్టు:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ/నటరాజన్, యజువేంద్ర చహల్.
Comments
Please login to add a commentAdd a comment