న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021కు ఇప్పటికే పలు జట్లు తమ అత్యుత్తమ కాంబినేషన్లను ఎంచుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే, కొన్ని జట్లు ఆటగాళ్ల(ఫామ్ ఆధారంగా) కొరతతో తుదిజట్టును ఎంపిక చేసే విధానంపై తర్జనభర్జన పడుతుంటే, టీమిండియాకు మాత్రం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెలక్ట్ చేయడం సవాలుగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ టీమిండియా ఓపెనింగ్ జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో శిఖర్ ధావన్ కంటే కూడా కేఎల్ రాహుల్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు మాజీ పేసర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ... ‘‘ఓపెనింగ్ జోడీపై చర్చ ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కేఎల్ రాహుల్, రోహిత్ శిఖర్ ధావన్ కంటే ముందే ఉంటారని చాలా మంది అభిప్రాయం. కాబట్టి, ధావన్ పోటీలో నిలవాలంటే మరిన్ని ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. వారిపై ఒత్తిడి పెట్టాలంటే.. శ్రీలంక సిరీస్‌లో తప్పకుండా రాణించాల్సి ఉంటుంది. నాకు తెలిసి, వన్డే సిరీస్‌లో రాణింపు.. టీ20 వరల్డ్ కప్ తుదిజట్టు ఎంపికలో ఎంత వరకు ప్రభావం చూపుతుందో చెప్పలేం.. కానీ... కచ్చితంగా ధావన్ మాత్రం అక్కడ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రోహిత్ వైస్ కెప్టెన్ కాబట్టి తప్పకుండా జట్టులో ఉంటాడు.
ఇక రాహుల్ ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన సత్తా ఏంటో అనేకమార్లు నిరూపించుకున్నాడు. కాబట్టి... అత్యుత్తమ ఫాం కనబరచకపోతే ధావన్‌కు తుదిజట్టులో చోటు సంపాదించడం కాస్త కష్టమే’’ అని పేర్కొన్నాడు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీని నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా... కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2021 సీజన్‌లో జరగాల్సిన మిగతా 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ 19 నుంచి నిర్వహించనున్నారు. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్‌లో సత్తా చాటడం ద్వారా సెలక్షన్ టీం దృష్టిని ఆకర్షించేందుకు భారత క్రికెటర్లు సిద్ధమవతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment