సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ తబ్రేజ్ షంసీ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్‌లో భాగమయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే, జాతీయ జట్టుకు తన సేవలు అవసరమైన వేళ తప్పకుండా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ధారించింది.
అందుకే ఈ నిర్ణయం
‘‘సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. దేశవాళీ క్రికెట్ సీజన్ సమయంలో కాస్త విరామంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్ మ్యాచ్‌లు ఆడాలని కోరుటుకుంటున్నాను. నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలని భావిస్తున్నాను.
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే, ప్రొటిస్ జట్టుకు నా అవసరం ఉందనుకున్న సమయంలో బోర్డు పిలిస్తే కచ్చితంగా దేశానికి ఆడతా’’ అని తబ్రేజ్ షంసీ పేర్కొన్నాడు. కాగా 2016లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తబ్రేజ్ షంసీ.. వన్డే, టీ20 జట్టలో ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్‌గా ఎదిగాడు.
ఇప్పటి వరకు సౌతాఫ్రికా తరఫున 51 వన్డేలు, 70 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 72, 89 వికెట్లు పడగొట్టాడు. అయితే, టెస్టుల్లో మాత్రం షంసీ నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు తీయగలిగాడు.
సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినా
ఇక షంసీ నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఎనోచ్ తెలిపాడు. సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్లలో షంసీ కీలక సభ్యుడని.. సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని చెప్పడం అతడి నిజాయితీకి నిదర్శనమని ప్రశంసించాడు.
కాగా షంసీ ఐపీఎల్‌తో పాటు మరెన్నో టీ20లలో భాగమవుతున్నాడు. చివరగా.. ఈ ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్‌తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
చదవండి: ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment