హండ్రెడ్ లీగ్‌లో చారిత్రక శతకం నమోదైంది. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ట్యామీ బేమౌంట్ లీగ్ హిస్టరీలోనే (పురుషులు, మహిళలు) అత్యధిక స్కోర్ (118) నమోదు చేసింది. ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట 14) జరిగిన మ్యాచ్‌లో వెల్ష్‌ఫైర్ ఓపెనర్ బేమౌంట్ 61 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసింది. హండ్రెడ్ లీగ్ పురుషులు, మహిళల విభాగాల్లో ఇదే అత్యధిక స్కోర్ కాగా.. ఈ లీగ్ మహిళల విభాగంలో ఇదే మొట్టమొదటి సెంచరీ కావడం విశేషం. బేమౌంట్.. ఓవల్ ఇన్విన్సిబుల్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ అత్యధిక స్కోర్ (108) రికార్డును బద్దలుకొట్టి లీగ్ రికార్డ్స్‌లో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకుంది.
రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్‌ఫైర్.. బేమౌంట్ శతక్కొట్టడంతో నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. మహిళల హండ్రెడ్ లీగ్‌లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్ కావడం మరో విశేషం. వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్‌లో బేమౌంట్ రికార్డు సెంచరీతో కదం తొక్కగా.. డంక్లీ (24), సారా బ్రైస్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాకెట్స్ బౌలర్లలో క్రీస్టీ గార్డన్ 2, అలానా కింగ్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. ఫ్రేయా డేవిస్ (2/19), అలెక్స్ హార్ట్లీ (1/28), షబ్నిమ్ ఇస్మాయిల్ (1/23), సోఫియా డంక్లీ (1/16) రాణించడంతో 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా వెల్ష్ ఫైర్ 41 పరుగుల తేడాతో గెలపొంది, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాకెట్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ స్మిత్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లిజెల్ లీ (26), హర్మాన్‌ప్రీత్ కౌర్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment