అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించరు.. అదే అద్భుతం జరిగిన తర్వాత దానిని ఎవరూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు అంటారు. నిజమే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లు ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే, బీసీసీఐ నమ్మకాన్ని నిలబెడుతూ సత్తా చాటారు. ఎన్నో అవాంతరాలు దాటి సంప్రదాయ క్రికెట్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఆ ఆటగాళ్ల నేపథ్యం, ఈ సిరీస్‌లో నమోదు చేసిన గణాంకాలు పరిశీలిద్దాం.
శభాష్ సిరాజ్..
హైదరాబాదీ బౌలర్. అతిసాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి ఆటోడ్రైవర్. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ మెరుగ్గా రాణించిన సిరాజ్.. ఆసీస్ సిరీస్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌కు ఎంపికయ్యాడు. టూర్‌లో ఉండగానే అతడి తండ్రి మరణించినా.. ఆయన కలను నెరవేర్చాలనే ఆశయంతో జట్టుతోనే ఉండిపోయాడు. రెండో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ.. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు. 13 వికెట్లు తీసి సత్తా చాటాడు.
బాక్సింగ్ డే టెస్టుతో పాటు గబ్బాలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తంగా 73 పరుగులు ఇచ్చిన హైదరాబాదీ, ఓపెనర్ డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్‌స్మిత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. వీరితో పాటు హాజల్‌వుడ్, స్టార్క్‌ను అవుట్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. (చదవండి: 36 పరుగులకు ఆలౌట్.. కానీ ఇప్పుడు )
రూ. 300 కోసం మ్యాచ్‌లు ఆడి..
హర్యానాలోని కర్నాల్‌లో జన్మించాడు. రైట్ ఆర్మ్ మీడియం బౌలర్. అతడి తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన సైనీ.. క్రికెట్‌లో శిక్షణ తీసుకునేందుకు సరిపడా డబ్బు లేక ఇబ్బందులు పడ్డాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతూ వాటి ద్వారా వచ్చే 300 రూపాయలతో అవసరాలు తీర్చుకునేవాడు. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సైనీ వన్డేల్లో రంగప్రవేశం చేశాడు. ఇక సీనియర్ పేసర్ ఉమేశ్ గాయపడటంతో సిడ్నీ టెస్టుతో సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతడు.. ఈ టెస్టు సిరీస్‌లో మొత్తంగా 4 వికెట్లు పడగొట్టాడు.
నటరాజన్‌కు కలిసొచ్చిన టూర్
తమిళనాడులోని చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ 1991లో జన్మించాడు. నిరుపేద కుటుంబం అతడిది. నటరాజన్ అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్ బాల్‌తోనే ప్రాక్టీసు చేశాడు.
ఈ క్రమంలో 2015లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే అతడి బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్ల సలహాలు నటరాజన్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలతో బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చేసుకుని సత్తా చాటాడు. 2016 తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చిన నటరాజన్ యార్కర్లు సంధించే విధానంతో ఐపీఎల్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఆసీస్ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికైన నటరాజన్ మనుకా ఓవల్ మైదానంలో ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఆ తర్వాత టీ20, గబ్బా మ్యాచ్ ద్వారా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. మొత్తంగా11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీశాడు.
సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్, గిల్
తండ్రి సుందర్‌కు క్రికెట్ అంటే మక్కువ. ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ వాషింగ్టన్ అనే వ్యక్తి ఆయనకు అండగా నిలబడ్డాడు. ప్రోత్సాహం అందించాడు. ఈ క్రమంలో స్థానికంగా సుందర్ మంచి పేరు సంపాదించారు. అయితే తన రెండో కొడుకు జన్మించే కొన్నిరోజుల ముందు వాషింగ్టన్ మరణించడంతో ఆయన జ్ఞాపకార్థం, వాషింగ్టన్ సుందర్‌గా తనకు నామకరణం చేశారు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ప్రవేశించాడు. గబ్బా టెస్టుతో సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సుందర్.. 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక వన్డేల్లో ఒకటి, టీ20ల్లో 21 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక సిరాజ్, సైనీ, నటరాజన్, సుందర్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తంగా 259 పరుగులతో జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment