
విజయంతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావించిన టీమిండియాకు కష్టాలు తప్పడం లేదు. రెండో టెస్టులో 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 106 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే క్రీజులో శ్రేయాస్ అయ్యర్(22 బ్యాటింగ్), రవిచంద్రన్ అశ్విన్(11 పరుగులు బ్యాటింగ్) ఉండడంతో టీమిండియాకు గెలుపు అవకాశాలున్నాయి. విజయానికి మరో 36 పరుగులు మాత్రమే అవసరమైనప్పటికి పిచ్ అనూహ్యమైన టర్న్ తీసుకుంటుండడంతో మ్యాచ్ చివరి వరకు చెప్పలేం.
అయితే అయ్యర్, అశ్విన్‌ల మధ్య ఇప్పటివరకు 37 పరుగుల కీలక భాగస్వామ్యం ఏర్పడింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు 45/4 క్రితం రోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా కాసేపటికే జయదేవ్ ఉనాద్కట్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రిషబ్ పంత్ 9 పరుగులు మాత్రమే చేసి మెహదీ హసన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.