Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి మహిళా, పురుష జట్లను పంపుతున్న విషయం విదితమే. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో వుమెన్స్ టీమ్.. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు హోంగ్జూకు వెళ్లనున్నాయి.
అయితే, అంతకంటే ముందు స్వదేశంలో సెప్టెంబరు 22న ఆరంభం కానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రుతురాజ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఆసీస్‌తో తొలి మ్యాచ్‌లో అతడు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
రెంటికీ చెడ్డ రేవడి
ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో తిలక్ వర్మ, రింకూ సింగ్ సహా పలువురు యువ స్టార్లు చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
సంజూ శాంసన్
ఆసియా కప్‌లో అలా.. వరల్డ్‌కప్‌జట్టులో ఇలా
కేఎల్ రాహుల్ ఆగమనంతో ఆసియా కప్-2023లో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌తో పోటీలో ఓడిన సంజూ.. రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఇక బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నా ఈ వన్డే ఈవెంట్‌లో అతడిని దురదృష్టం వెక్కిరించింది.
కెప్టెన్ కావాల్సినోడు.. మరీ ఇంత అన్యాయమా?
ప్రపంచకప్-2023 జట్టులోనూ సూర్య వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ‘‘ఆసియా క్రీడల జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది.
ఆసియా కప్‌లో రిజర్వ్‌గా ఉన్నాడు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం లేదు. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు.
ఇషాన్‌కు వరుస అవకాశాలు
ఇషాన్ మిడిలార్డర్‌లో నిలదొక్కుకునేందుకు ఇప్పటికే మేనేజ్‌మెంట్ కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చింది. సంజూ శాంసన్ ఆసియా క్రీడల జట్టులో ఉంటేనైనా బాగుండేది. వరల్డ్‌కప్ టీమ్‌లో ఎలాగూ చోటివ్వలేదు.. కనీసం ఆసియా క్రీడల్లో ఆడేందుకు కూడా పనికిరాడా? ఇది సరైన పద్ధతి కాదు.. ప్రపంచకప్ జట్టులో ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డ వ్యక్తి కచ్చితంగా ఈ టీమ్‌లోనైనా ఉండాల్సింది కదా. కేవలం సభ్యుడిగా కాదు.. నిజానికి కెప్టెన్ అవ్వాల్సింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
చదవండి: అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment