WC 2023: ఫిట్‌గా ఉన్నా శ్రేయస్‌ అయ్యర్‌కు నో ఛాన్స్‌! ఇక మర్చిపోవాల్సిందేనా? | Ind Vs SL Dont Think Management Will Risk Playing Shreyas Sanjay Bangar | Sakshi
Sakshi News home page

Ind vs SL: ఫిట్‌గా ఉన్నా శ్రేయస్‌ అయ్యర్‌కు నో ఛాన్స్‌! ఇక మర్చిపోవాల్సిందేనా? వరల్డ్‌కప్‌లోనూ..

Published Sun, Sep 17 2023 11:15 AM | Last Updated on Sun, Sep 17 2023 12:06 PM

Ind Vs SL Dont Think Management Will Risk Playing Shreyas Sanjay Bangar - Sakshi

WC 2023- Shreyas Iyer Fitness Big Concern For Team India: సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్‌-2023 సందర్భంగా రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను గాయం వేధిస్తోంది. వెన్నునొప్పికి సర్జరీ చేయించుకుని తిరిగొచ్చిన అయ్యర్‌ పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.

రీఎంట్రీలో విఫలం
ఈ లీగ్‌ మ్యాచ్‌లో అతడు కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత నేపాల్‌తో మ్యాచ్‌ ఆడినప్పటికీ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌లే లక్ష్యాన్ని ఛేదించడంతో అయ్యర్‌కు బ్యాటింగ్‌ చేసే అవసరమే రాలేదు.

అయితే, సూపర్‌-4లో పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా అనూహ్యంగా ఆఖరి నిమిషంలో అతడు జట్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పి తిరగబెట్టడంతో శ్రేయస్‌ అయ్యర్‌ను పక్కన పెట్టినట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ సందర్భంగా తెలిపాడు.

పునరాగమనంలో రాహుల్‌ సెంచరీ
మ్యాచ్‌కు ఐదు నిమిషాల ముందు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌కు ఆడాల్సి ఉంటుందని చెప్పగా.. అతడు అందుకు సంసిద్ధమైనట్లు పేర్కొన్నాడు. అయితే, అయ్యర్‌ అభిమానులు మాత్రం కావాలనే అయ్యర్‌ను తప్పించి రాహుల్‌ను జట్టులోకి తీసుకువచ్చారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక పాక్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌ అజేయ సెంచరీ(111)తో రీఎంట్రీని ఘనంగా చాటాడు. మరోవైపు.. అయ్యర్‌ రెగ్యులర్‌గా బ్యాటింగ్‌కు వచ్చే నాలుగో స్థానంలో రాహుల్‌ రాగా.. ఇషాన్‌ కిషన్‌కు ఐదో నంబర్‌ బ్యాటర్‌గా స్థానం దక్కింది.

అయ్యర్‌ ఫిట్‌గా ఉన్నా నో ఛాన్స్‌
వెస్టిండీస్‌ సహా ఆసియా కప్‌ ఆరంభ మ్యాచ్‌లలో అదరగొట్టిన ఈ ఓపెనర్‌ మిడిలార్డర్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కావడం అతడికి మరో ప్లస్‌ పాయింట్‌. ఇదిలా ఉంటే.. సూపర్‌-4లో ఆఖరిదైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు శ్రేయస్‌ అయ్యర్‌ ఫిట్‌గా ఉన్నాడని.. అతడు బ్యాటింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు ఫొటోలు బయటకు వచ్చాయి.

కానీ.. బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లోనూ అయ్యర్‌కు చోటు దక్కలేదు. టీ20 నయా స్టార్‌ తిలక్‌ వర్మ వన్డే ఈ మ్యాచ్‌ సందర్భంగా వన్డే అరంగేట్రం చేయగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ ఆరోస్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. యధావిధిగా రాహుల్‌ నంబర్‌ 4, ఇషాన్‌ నంబర్‌ 5లో బరిలోకి దిగారు.

అయ్యర్‌ విషయంలో రిస్క్‌ తీసుకోరు.. కాబట్టి
ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీలంకతో ఫైనల్లోనూ శ్రేయస్‌ అయ్యర్‌ను ఆడించే పరిస్థితి కనబడటం లేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ స్పందిస్తూ.. అయ్యర్‌ విషయంలో రిస్క్‌ తీసుకునే బదులు మేనేజ్‌మెంట్‌ ఇషాన్‌ కిషన్‌ వైపే మొగ్గు చూపుతుందని అభిప్రాయపడ్డాడు.

అంతేకాదు.. శ్రేయస్‌ కోసం.. మంచి ఫామ్‌లో ఉన్నా ఇషాన్‌పై వేటు వేయకపోవచ్చని పేర్కొన్నాడు. రాహుల్‌ నాలుగో స్థానంలో ఆడనుండగా... ఐదో నంబర్‌ బ్యాటర్‌గా ఇషాన్‌కు శ్రీలంకతో ఫైనల్‌ జట్టులో చోటు ఖాయమేనని చెప్పుకొచ్చాడు. 

అయ్యో అయ్యర్‌.. అసలేమైంది?
ఈ నేపథ్యంలో ఇంతకీ శ్రేయస్‌ అయ్యర్‌కు ఏమైంది? నిజంగానే ఫిట్‌నెస్‌ సమస్యలు ఉన్నాయా? లేదంటే ఇషాన్‌ కోసం అతడిని పక్కనపెడుతున్నారా? ఆసియా కప్‌ టోర్నీకి ముందు ఫిట్‌గా లేడని చెప్పిన కేఎల్‌ కమ్‌బ్యాక్‌ ఇవ్వగా.. అయ్యర్‌కు మాత్రం ఈ దుస్థితి ఏమిటో?

ఇలా అయితే.. వన్డే వరల్డ్‌కప్‌లో కూడా అతడు ఆడే పరిస్థితులు లేవని నిట్టూరుస్తున్నారు. అయితే, ప్రపంచకప్‌ కంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ తిరిగి సత్తా చాటుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైతే ఆసియా కప్‌-2023 ఫైనల్లో చోటు గురించి అయ్యర్‌ మర్చిపోవాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆసీస్‌తో సిరీస్‌తో సన్నాహకాలు
కాగా అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుండగా.. అక్టోబరు 8న టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఆసీస్‌ను ఢీకొట్టనుంది. అంతకంటే ముందు సొంతగడ్డపై సెప్టెంబరు 22- 27 వరకు ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. 

చదవండి: ఆర్సీబీ పేసర్‌కు లక్కీ ఛాన్స్‌! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement