ICC ODI World Cup 2023: వన్డేలకు పనికిరాడు.. అసలు ప్రపంచకప్-2023 జట్టుకు అతడిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? టీ20 ఫార్మాట్‌లో నెంబర్ 1 అయినంత మాత్రాన జట్టులో చోటిస్తారా? అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు..
అయినప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. తాము కచ్చితంగా సూర్యకు మద్దతునిస్తాం.. అండగా నిలుస్తాం.. వరల్డ్‌కప్ జట్టుకు అతడిని ఎంపిక చేయడం వెనుక మా ప్లాన్లు మాకున్నాయి అని స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.
తీవ్ర ఒత్తిడిలో ఆసీస్‌తో సిరీస్ బరిలో
దీంతో విమర్శలు రెట్టింపయ్యాయి. ఈ ముంబై బ్యాటర్ కోసం వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్ వంటి ప్రతిభ గల క్రికెటర్లను పక్కనపెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ బరిలో దిగాడు సూర్య.
వరుస హాఫ్ సెంచరీలు
తొలి మ్యాచ్‌లో 49 బంతుల్లో 50 పరుగులు సాధించిన అతడు.. రెండో వన్డేలో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. 24 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. పటిష్ట ఆసీస్‌తో మ్యాచ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లతో చెలరేగి తన ఆట స్థాయి ఏమిటో చూపించాడు.
ఇండోర్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. తనదైన రోజు ఫార్మాట్లకు అతీతంగా అద్భుతంగా రాణించగలనని నిరూపించుకున్నాడు.
తుదిజట్టులో మొదటి పేరు తనదే ఉండాలి
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూర్యకుమార్ యాదవ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ప్రతీ మ్యాచ్‌లోనూ అతడిని ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు.
‘‘సూర్యకుమార్ యాదవ్ ప్రతీ మ్యాచ్ ఆడాల్సిందే. అయితే, అతడిని ఎవరి స్థానంలో ఆడిస్తారో నాకు తెలియదు. తుదిజట్టులో మొదటి పేరు మాత్రం తనదే అయి ఉండాలి. ఆ తర్వాతే మిగతా ఆటగాళ్ల సెలక్షన్ గురించి ఆలోచించాలి.
ఐదో నంబర్‌లో సూర్యనే ఆడాలి
మ్యాచ్ స్వరూపానే మార్చగల ఇన్నింగ్స్ ఆడగల సత్తా అతడి సొంతం. తను మెరుగ్గా ఆడిన రోజు మ్యాచ్ ఏకపక్షంగా మారిపోతుంది. అలాంటి సమయంలో తనకంటే మెరుగైన స్ట్రైక్‌రేటు నమోదు చేయగల బ్యాటర్ మరొకరు ఉండరు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను మనం ఫినిషర్లుగా చూస్తాం.
నా దృష్టిలో మాత్రం సూర్యకుమార్ యాదవ్ ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. సూర్య కంటే బెటర్ ప్లేయర్ ఏ జట్టులోనూ లేడు’’ అని భజ్జీ.. సూర్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్‌లో కీలకంగా మారిన వేళ సూర్యను ఉద్దేశించి హర్భజన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ
6⃣6⃣6⃣6⃣
— BCCI (@BCCI) September 24, 2023
The crowd here in Indore has been treated with Signature SKY brilliance! 💥💥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN
Comments
Please login to add a commentAdd a comment