గౌతం గంభీర్(ఫైల్‌ఫోటో)
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్పపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మండిపడ్డాడు. ఎన్నో అంచనాలతో జట్టులోకి తీసుకున్న ఊతప్ప ఏమి చేస్తున్నాడని విమర్శించాడు. వచ్చామా.. వెళ్లామా అన్నట్లే ఊతప్ప బ్యాటింగ్ ఉందని గంభీర్ ధ్వజమెత్తాడు. అసలు ఊతప్ప నుంచి ఏమి ఆశించారో దాన్ని ఇప్పటివరకూ అతను చేయలేదన్నాడు. కనీసం మ్యాచ్‌లో ఊపును తీసుకొచ్చే యత్నం కూడా చేయడం లేకపోవడం కరెక్ట్ కాదన్నాడు. అదే సమయంలో రియాన్ పరాగ్ సరిగా ఆకట్టుకోవడం లేదన్నాడు. వారి ఆట ఇలానే ఉంటే రిజర్వ్ బెంచ్‌లో కూర్చొని మ్యాచ్‌లు చూసే పరిస్థితి వస్తుందన్నాడు. రాజస్తాన్ మేనేజ్‌మెంట్ అంచనాలను అందుకోవడానికి ఊతప్ప, పరాగ్‌లు యత్నించాల్సి ఉందన్నాడు.(చదవండి: ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్)
మిడిల్ ఆర్డర్‌లో రాజస్తాన్ అంచనాలను అందుకోలేకపోవడంతోనే గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైందన్నాడు. స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, జోస్ బట్లర్‌ల పైనే రాజస్తాన్ ఎక్కువగా ఆధారపడతుండటమే వారి ఓటములకు కారణమన్నాడు. ఇక రాజస్తాన్ జట్టుతో బెన్ స్టోక్స్ కలిశాడు కాబట్టి బ్యాటింగ్ కాంబినేషనల్ మార్పులు చూస్తామన్నాడు. స్టోక్స్ రావడంతో రాజస్తాన్ బలం పుంజుకుంటుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టాపార్డర్ బ్యాటింగ్‌లో లోటు స్టోక్స్ రాకతో తీరుతుందన్నాడు. జోస్ బట్లర్, స్మిత్, శాంసన్‌లు తొందరగా ఔటైన క్రమంలో మిడిల్ ఆర్డర్ చేతులెత్తేస్తుందని దీన్ని అధిగమిస్తే రాజస్తాన్‌కు తిరుగుండదని ఈసీపీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ గంభీర్ పేర్కొన్నాడు.ఈ సీజన్‌లో 3 కోట్ల రూపాయలకు ఊతప్పను రాజస్తాన్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకూ దానికి ఊతప్ప న్యాయం చేయలేదు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో (17, 2, 9, 5) దారుణంగా విఫలమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment