వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత భారత జట్టు సొంతగడ్డపై టి20 ఫార్మాట్‌లో కొత్త సమరానికి సిద్ధమైంది. గతంలో ఎన్నడూ ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడని అఫ్గానిస్తాన్‌తో సిరీస్ కోసం ఇప్పుడు టీమిండియా బరిలోకి దిగుతోంది. టి20 ప్రపంచకప్‌కు మరికొంత సమయం ఉన్నా... దానికి ముందు భారత్ ఆడనున్న ఆఖరి అంతర్జాతీయ సిరీస్ ఇదే కానుంది.
2022 వరల్డ్ కప్ సెమీస్ పరాజయం తర్వాత కుర్రాళ్ల కోసం వరుసగా విశ్రాంతి తీసుకుంటూ వచ్చిన రోహిత్, కోహ్లి ఇప్పుడే మళ్లీ ఈ సిరీస్‌లో ఆడనుండటంతో జట్టు బలం పెరిగింది. మరోవైపు అప్పుడప్పుడు కొన్ని మెరుపు ప్రదర్శనలతో సత్తా చాటుతున్న అఫ్గానిస్తాన్ పటిష్ట ప్రత్యర్థి పోటీనివ్వాలని పట్టుదలగా ఉంది.
మొహాలి: దక్షిణాఫ్రికా గడ్డపై టి20 సిరీస్‌లో సమంగా నిలిచిన భారత జట్టు స్వదేశంలో కొత్త సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. అఫ్గానిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల పోరులో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ తలపడుతుంది. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగడం ఇదే మొదటిసారి.
గతంలో ప్రపంచకప్, ఆసియా కప్‌లలో అఫ్గాన్‌ను ఎదుర్కొన్న ప్రతీసారి భారత్‌కే విజయం దక్కింది. ప్రస్తుతం కూడా బలాబలాల దృష్ట్యా అన్ని రంగాల్లో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. పునరాగమనం చేసిన సీనియర్లతో పాటు తమకు లభించిన పరిమిత అవకాశాల్లోనే తమను తాము నిరూపించుకున్న కుర్రాళ్లను పరీక్షించేందుకు కూడా ఇది సరైన అవకాశం.
కుర్రాళ్లంతా ఉత్సాహంగా...
టి20 జట్టులో కచ్చితంగా ఉండే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. అయితే రోహిత్ నాయకత్వంలో సత్తా చాటేందుకు ఇతర కుర్రాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో తానేంటో ఇప్పటికే నిరూపించుకొని ఫినిషర్‌గా చెలరేగుతున్న రింకూ సింగ్ తొలిసారి రోహిత్ కెపె్టన్సీలో ఆడనున్నాడు.
హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కూడా ఇటీవల ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. రోహిత్, యశస్వి ఓపెనింగ్ చేస్తారని కోచ్ ద్రవిడ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. యశస్వి శుభారంభం అందించాల్సి ఉండగా... కొంత విరామం తర్వాత బరిలోకి దిగుతున్న రోహిత్‌పై కూడా భారం ఉంది. ఫామ్‌ను బట్టి చూస్తే గిల్‌కు తుది జట్టులో చోటు కష్టమే. అయితే వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో మూడో స్థానంలో గిల్‌కు అవకాశం దక్కనుంది.
కీపర్‌గా ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా... సంజూ సామ్సన్ కాకుండా జితేశ్ శర్మ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపవచ్చు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తిరిగొచ్చినా అతడికి తొలి మ్యాచ్‌లో చాన్స్ దక్కకపోవచ్చు. భారత్ ముగ్గురు పేసర్లతో ఆడుతుందా లేక ఇద్దరికే పరిమితం అవుతుందా అనేది చూడాలి. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ చక్కటి ఫామ్‌లో ఉండగా...అదనంగా మరో ముగ్గురు స్పిన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు.
సత్తా చాటేనా...
వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. అదే ఫామ్‌లో ఆ జట్టు టి20ల్లోనూ కొనసాగిస్తే భారత్‌కు ఇబ్బందులు కలగవచ్చు. గుర్బాజ్ ఇప్పటికే మెరుపు ఓపెనర్‌గా గుర్తింపు తెచ్చుకోగా, కెప్టెన్ ఇబ్రహీం మంచి ఫామ్‌లో ఉన్నాడు. రహ్మత్, నజీబుల్లా జట్టు బ్యాటింగ్ భారం మోస్తారు. నబీ, ముజీబ్, నూర్‌లతో అఫ్గాన్ స్పిన్ పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ముగ్గురిని కూడా తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో ఇక్కడ ఆడిన అనుభవం ఉన్న పేస్‌బౌలర్లు ఫజల్ హక్, నవీన్ ప్రభావం చూపించగలరు. అయితే జట్టు ప్రధాన బలం రషీద్ ఖాన్ సిరీస్‌కు దూరం కావడం ఆ జట్టుకు ప్రతికూలాంశం. గాయం నుంచి కోలుకుంటున్న రషీద్ ఊహించినట్లుగానే సిరీస్ మొదలయ్యే వరకు కోలుకోలేకపోయాడు. అయితే పోరాటపటిమ ఉన్న అఫ్గాన్ సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటీవలే యూఈఏతో జరిగిన సిరీస్‌ను 2–1తో అఫ్గానిస్తాన్ గెలుచుకుంది.
4 మొహాలీలో భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడింటిలో విజయం సాధించి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. అఫ్గానిస్తాన్‌తో టీమిండియా ఐదు టి20లు ఆడగా... నాలుగింటిలో గెలిచింది. మరో మ్యాచ్ రద్దయింది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్ ), యశస్వి, గిల్, తిలక్, రింకూ, జితేశ్, అక్షర్, అర్‡్షదీప్, ముకేశ్, కుల్దీప్, రవి బిష్ణోయ్.
అఫ్గానిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్ ), హజ్రతుల్లా, గుర్బాజ్, అజ్మతుల్లా, నజీబుల్లా, నబీ, నైబ్, ముజీబ్, ఖైస్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్
పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్ పిచ్. పీసీఏ స్టేడియం భారీ స్కోర్లకు వేదిక. ఇక్కడ జరిగిన చివరి టి20లో (2022) మొత్తం 419 పరుగులు నమోదయ్యాయి. ఉత్తరాదిలో మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment