విరాట్ కోహ్లి ఆడలేదు... రోహిత్ శర్మ విఫలమయ్యాడు... అయినా సరే యువ ఆటగాళ్ల ప్రదర్శనతో భారత్ విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్‌తో పోరులో అక్కడక్కడా కాస్త శ్రమించినా... చివరకు గెలుపు టీమిండియాదే అయింది. ముందుగా అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో శివమ్ దూబే మెరుపులు జట్టును సిరీస్‌లో ఆధిక్యంలో నిలిపాయి. అఫ్గాన్ ఆటగాళ్లు కొంత పోరాడినా... మంచు ప్రభావంతో పాటు ఒత్తిడిలో ఆ జట్టు చిత్తయింది.
మొహాలి: అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. గురువారం జరిగిన తొలి పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. నబీ (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, జితేశ్ శర్మ (20 బంతుల్లో 31; 5 ఫోర్లు) రాణించాడు.
నబీ మెరుపులు...
అఫ్గాన్‌కు ఓపెనర్లు ఇబ్రహీమ్ జద్రాన్ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), గుర్బాజ్ (28 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగైన ఆరంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 48 బంతుల్లో 50 పరుగులు జోడించారు. 1 పరుగు వద్ద ఇబ్రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను దూబే వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. అయితే ఒకే స్కోరు వద్ద వీరిద్దరిని అవుట్ చేసి భారత్ పైచేయి సాధించింది. తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న రహ్మత్ షా (3) కూడా విఫలమయ్యాడు.
ఈ దశలో నబీ, అజ్మతుల్లా (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యంతో అఫ్గాన్ కోలుకుంది. ముఖ్యంగా నబీ దూకుడు ప్రదర్శించడంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. రవి బిష్ణోయ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు రాగా... ముకేశ్ వేసిన తర్వాతి ఓవర్లో నబీ 2 సిక్స్‌లు బాదాడు. నబీ, అజ్మతుల్లా నాలుగో వికెట్‌కు 43 బంతుల్లో 68 పరుగులు జత చేయగా... ముకేశ్ ఒకే ఓవర్లో వీరిని పెవిలియన్ పంపించాడు. చివరి 2 ఓవర్లలో అఫ్గాన్ 6 ఫోర్లతో 28 పరుగులు రాబట్టింది.
రోహిత్ డకౌట్...
ఛేదనలో రెండో బంతికే భారత్‌కు అనూహ్య షాక్ తగిలింది. శుబ్‌మన్ గిల్ (12 బంతుల్లో 23; 5 ఫోర్లు)తో సమన్వయ లోపంతో కెపె్టన్ రోహిత్ శర్మ (0) రనౌట్‌గా వెనుదిరిగాడు. మిడాఫ్ దిశగా ఆడిన రోహిత్ సింగిల్ కోసం దూసుకుపోగా, గిల్ ఏమాత్రం స్పందించకుండా తన క్రీజ్‌లోనే ఉండిపోయాడు. దాంతో డకౌట్ అయిన రోహిత్ తన సహచరుడిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వెనుదిరిగాడు. ఆ తర్వాత కొన్ని చక్కటి బౌండరీలు కొట్టిన గిల్ అదే జోరులో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
భారీ షాట్లు ఆడటంలో తడబడిన తిలక్ వర్మ (22 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో దూబే, జితేశ్ భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. అఫ్గాన్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్‌కు సానుకూలంగా మారింది. జితేశ్ వెనుదిరిగినా... రింకూ సింగ్ (9 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో దూబే మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (స్టంప్డ్) జితేశ్ (బి) అక్షర్ 23; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) దూబే 25; అజ్మతుల్లా (బి) ముకేశ్ 29; రహ్మత్ (బి) అక్షర్ 3; నబీ (సి) రింకూ (బి) ముకేశ్ 42; నజీబుల్లా (నాటౌట్) 19; కరీమ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–50, 2–50, 3–57, 4–125, 5–130. బౌలింగ్: అర్ష్దీప్ 4–1–28–0, ముకేశ్ 4–0–33–2, అక్షర్ 4–0–23–2, సుందర్ 3–0–27–0, దూబే 2–0–9–1, బిష్ణోయ్ 3–0–35–0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 0; శుబ్‌మన్ గిల్ (స్టంప్డ్) గుర్బాజ్ (బి) ముజీబ్ 23; తిలక్ (సి) గుల్బదిన్ (బి) అజ్మతుల్లా 26; శివమ్ దూబే (నాటౌట్) 60; జితేశ్ శర్మ (సి) ఇబ్రహీమ్ (బి) ముజీబ్ 31; రింకూ సింగ్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (17.3 ఓవర్లలో 4 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–0, 2–28, 3–72, 4–117. బౌలింగ్: ఫారుఖీ 3–0–26–0, ముజీబ్ 4–1–21–2, మొహమ్మద్ నబీ 2–0–24–0, నవీన్ 3.3–0–43–0, అజ్మతుల్లా 4–0–33–1, గుల్బదిన్ 1–0–12–0.
Comments
Please login to add a commentAdd a comment