ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో మొదటి ఘట్టం విజయవంతంగా పూర్తయింది. ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ జపాన్ ప్రపంచ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. ప్రధాన స్టేడియంలో ప్రేక్షకులు లేకపోయినా సరే... వేడుకల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఆకర్షణీయంగా నిర్వహించింది. ఒలింపిక్ స్ఫూర్తిని అన్ని విధాలా ప్రదర్శించడంతోపాటు జపాన్ దిగ్గజ క్రీడాకారులకు అన్ని చోట్లా తగిన గౌరవం చూపిస్తూ వారిని ఈ సంబరంలో భాగం చేసింది. వివిధ దేశాల మార్చ్ పాస్ట్‌లతో కార్యక్రమం కళకళలాడగా... అనూహ్యంగా అవకాశం దక్కించుకున్న యువ టెన్నిస్ క్రీడాకారిణి నయోమి ఒసాకా ఒలింపిక్ జ్యోతిని వెలిగించడంతో టోక్యో–2020 క్రీడలకు అధికారికంగా తెర లేచింది. ఒలింపిక్స్ నిర్వహణను వ్యతిరేకిస్తూ స్టేడియం బయట కొందరు స్థానికులు నిరసన ప్రదర్శించగా, ఏడాది ఆలస్యంగానైనా సరే విశ్వ క్రీడలకు విజిల్ మోగడం విశేషం.
టోక్యో: టోక్యోకు ఒలింపిక్స్‌ను కేటాయిస్తూ 2013లో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో ప్రతికూలతలు, సవాళ్లను నిర్వాహకులు అధిగమించాల్సి వచి్చంది. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితులను వివరిస్తూ ప్రదర్శించి వీడియోతో కార్యక్రమం ప్రారంభమైంది. కౌంట్‌డౌన్ 20 నుంచి మొదలు పెట్టి 0 వరకు రాగానే స్టేడియం మొత్తం ప్రకాశిస్తూ బాణాసంచా వెలుగులు, మెరుపులతో నిండిపోయింది.
కరోనా కాలంలో ఆటగాళ్లంతా ఫిట్‌నెస్ కోసం ఇంట్లోనే శ్రమించారు. దీనినే కాస్త వ్యంగ్యంగా చెబుతున్నట్లుగా జపాన్ బాక్సర్ సుబాజా అరీసా ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తి చూపించారు. జపాన్ రాజు నరుహిటో, ఐఓసీ చైర్మన్ థామస్ బాచ్ స్టేడియంలోకి అడుగు పెట్టిన తర్వాత ఆరుగురు వ్యక్తులు కలిసి (ఇందులో ఇద్దరు ఒలింపిక్ స్వర్ణపతక విజేతలు) జపాన్ జాతీయ జెండాను తీసుకొస్తుండగా... ఆ దేశ జాతీయ గీతం ‘కిమిగయో’ను స్థానిక గాయకుడు మిసియా పాడారు.
చెక్కతో రూపొందించిన ఐదు రింగుల ఒలింపిక్ చిహ్నాన్ని తీసుకొస్తున్న సమయంలో మరిన్ని టపాసులతో స్వాగతం పలికారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న జపాన్ క్రీడాకారులు నాటిన మొక్కలతో పెరిగిన చెట్ల నుంచి తెచ్చిన కలపను దీనిని రూపొందించేందుకు వాడటం విశేషం. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారికి, 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో కాల్పులకు గురై మరణించిన ఇజ్రాయెల్ ఆటగాళ్లకు నివాళిగా స్టేడియంలో కొద్దిసేపు మౌనం పాటించారు.
నోబెల్ బహుమతి విజేత, బంగ్లాదేశ్‌కు చెందిన సామాజికవేత్త ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్‌కు ఒలింపిక్ నిర్వాహకుల తరఫున ప్రత్యేక అవార్డును ప్రకటించారు. జపాన్ అక్షరమాలతో వివిధ దేశాల మార్చ్‌పాస్ట్ ప్రారంభమైంది. అందరికంటే ముందుగా గ్రీస్ దేశం రాగా... రెండో స్థానంలో శరణార్ధుల జట్టు నడిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో అతి పిన్న వయసు్కరాలిగా (12 ఏళ్లు) గుర్తింపు పొందిన సిరియా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, ఆ దేశ ఫ్లాగ్ బేరర్ హెండ్ జాజా మార్చ్‌పాస్ట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రియో ఒలింపిక్స్ తరహాలోనే టోంగాకు చెందిన అథ్లెట్ పిటా టౌఫటోఫువా ‘షర్ట్‌లెస్’గా వచ్చి మరోసారి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు. వనువాటు దేశానికి చెందిన రీలియో రీ కూడా ఇలాగే నడిచాడు. అమెరికా బృందం మార్చ్‌పాస్ట్ సమయంలో అక్కడే ఉన్న ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్ తమ ఆటగాళ్లను ప్రోత్సహించింది. రెజ్లర్ సుసాకి యుయి, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి రుయి హచిమురా జపాన్ ఫ్లాగ్ బేరర్లుగా ముందుండి నడిపించారు. అనంతరం జపాన్ క్రీడాకారులు యమగత ర్యోటా (అథ్లెటిక్స్), ఇషికావా కసుమి (టేబుల్ టెన్నిస్) ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అందరి తరఫున ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో స్టేడియం పైభాగం నుంచి చూపించిన టోక్యో 2020 ఎంబ్లమ్, గ్లోబ్ ప్రధానాకర్షణగా నిలిచాయి. దీని కోసం 1,824 డ్రోన్లు వాడటం విశేషం. జాన్ లెనాన్ ‘ఇమాజిన్’ పాట, ఇచికావా ఎబిజో ‘కాబుకి’, గ్రామీ విజేత హిరోమి పియానో ప్రదర్శన, కాగితంతో చేసిన పావురాలను ఎగరవేయడంతో సాంస్కృతిక కార్య క్రమాలు సుసంపన్నమయ్యాయి. ఒలింపిక్స్ కు సంబంధించిన 50 పిక్టోరియల్స్‌తో జపాన్ కమెడియన్లు మాస్, హిటోషి చేసిన కార్యక్రమం సరదాగా సాగింది.
జపాన్ బ్యాడ్మింటన్ స్టార్ కెంటో మొమొటా తో పాటు మరో ఐదుగురు కలిసి ఒలింపిక్ పతాకాన్ని స్టేడియంలోకి తీసుకొచ్చారు. కరోనా సమయంలో శ్రమించిన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కూడా ఒలింపిక్ పతాకాన్ని అందుకునే అవకాశం కల్పించారు. చివరగా... ఆరుగురు జపాన్ అగ్రశ్రేణి ఆటగాళ్లు, ఒలింపిక్ విజేతలు కలిసి క్రీడా జ్యోతిని తీసుకొచ్చారు. పై భాగంలో ఉన్న ప్రత్యేక వేదిక వద్దకు వెళ్లి నయోమి ఒసాకా జ్యోతిని వెలిగించింది. 2011లో జపాన్‌లో వచ్చిన సునామీ, భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన మూడు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment