బంగారం వెల రోజురోజుకూ మారిపోవచ్చు... కానీ ఆ బంగారు పతకం విలువ అమూల్యం... శాశ్వతంగా వన్నె తగ్గకుండా చరిత్రలో నిలిచిపోతుంది. జీవితంలో ఎంత పసిడి ధరించినా ఆ పతకధారణ కోసం జీవిత కాలం కష్టపడేందుకు అందరూ సిద్ధం... బంగారంతో పోటీ పడి అక్కడ సాధించే వెండి పతకం కూడా ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతుంది... ఆ వేదికపై కంచు మోత కూడా ఎందరికో కనకమంత ఆనందాన్ని పంచుతుంది... గెలుచుకున్న కాంస్యం అంతులేని కీర్తిని మోసుకొస్తుంది.
ఆశలు, ఆశయాలూ అన్నీ ఉంటాయి... అపరిమిత ఆనందం, అంతులేని దుఃఖం కూడా కనిపిస్తాయి... విజయం సాధించిన వేళ, అదే గెలుపును త్రుటిలో చేజార్చుకొని గుండె పగిలిన క్షణాన ఆనందబాష్పాలు, కన్నీళ్లూ వేరు చేయలేనంతగా కలగలిసిపోతాయి... కొందరికి ఆ పతకం జీవితాశయం అయితే మరికొందరికి అదే జీవితం... విశ్వ వేదికపై తమ జాతీయ గీతం వినిపిస్తుండగా... జాతీయ జెండా ఎగురుతుండగా ఆటగాళ్ల మనసులో భావనను కొలిచేందుకు ఏ మీటర్లూ సరిపోవు.
పక్షం రోజుల వ్యవధిలో అక్కడ ఎన్నో రకాల భావోద్వేగాలు కనిపిస్తాయి... ఎందరినో ఆ క్రీడలు హీరోలుగా మారుస్తాయి... కొందరు దిగ్గజాలూ జీరోలుగా మారి మౌనంగా మైదానం నుంచి నిష్క్రమించే దృశ్యాలు కోకొల్లలు... ఒలింపిక్స్ అంటే ఒక మహా ఉత్సవం... 204 దేశాల ఆటగాళ్లతో జరిగే అతి పెద్ద క్రీడా పండగ. ఏళ్ల కఠోర శ్రమకు ప్రతిఫలాన్ని ఆశించే అథ్లెట్లు తమ సత్తాను ప్రదర్శించేందుకు సరైన వేదిక... విశ్వ సంగ్రామంలో గెలిచి గొప్పగా వెలిగేందుకు వచ్చే అత్యుత్తమ అవకాశం.
క్రీడాకారులంతా ఒలింపిక్స్‌లో ఆడాలని అనుకుంటే కరోనా మహమ్మారి ఒలింపిక్స్‌తో సంవత్సర కాలంగా ఆడుకుంది. ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగానైనా మెగా ఈవెంట్‌కు తెర లేవనుండటం ఊరట కలిగించే విషయం. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు, ఆర్థికపరమైన నష్టాలు, పాజిటివ్ కేసులు... ప్రతీ రోజూ ఆటలు జరగడంపై సందేహాలే... కానీ అన్ని అవరోధాలను అధిగమించి చివరకు క్రీడల స్ఫూర్తి కోవిడ్‌ను జయించింది. ఈవెంట్స్ మొదలైన తర్వాత కూడా ఆటలకు ఎలాంటి గండాలు, రాకూడదని ప్రపంచమంతా కోరుకుంటోంది. విజేతలు ఎవరైనా అనూహ్య, అసాధారణ పరిస్థితుల మధ్య జరుగుతున్న టోక్యో క్రీడలు ఒలింపిక్స్ చరిత్రలో అన్నింటికంటే భిన్నంగా నిలిచిపోతాయి.
టోక్యో: ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం గత ఏడాదే జరగాల్సి ఉన్నా... కరోనా కారణంగా సంవత్సరం పాటు వాయిదా పడిన ఆటలకు నేటితో తెర లేవనుంది. రెండు వారాల పాటు జరిగే క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. క్యాలెండర్‌లో తేదీ మారినా... మార్కెటింగ్, ఇతర కారణాల వల్ల టోక్యో–2020గానే ఈ క్రీడలను పరిగణిస్తున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఏసీ)లో 206 సభ్య దేశాలు ఉండగా... ఉత్తర కొరియా పోటీల నుంచి గతంలోనే తప్పుకుంది. కరోనా భయంతో ఆఫ్రికా దేశం గినియా కూడా ఆటల్లో పాల్గొనడం లేదని గురువారం ప్రకటించింది. దాంతో 204 దేశాలకు చెందిన అథ్లెట్లు బరిలో నిలిచారు.
ఐఓసీ ఎంపిక చేసిన శరణార్ధుల జట్టు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత డోపింగ్ కేసుల కారణంగా రష్యా దేశంపై నిషేధం కొనసాగుతున్నా.... డోపింగ్‌తో సంబంధం లేని రష్యా క్రీడాకారులకు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవకాశమిచ్చారు. వీరందరూ రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్‌ఓసీ) పేరిట బరిలోకి దిగుతారు. గేమ్స్ విలేజ్‌తో పాటు బయట కూడా కరోనా కేసులు బయటపడుతున్నా... ఒలింపిక్స్‌ను ఎలాగైనా నిర్వహిస్తామని ఐఓసీ స్పష్టం చేసింది. సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ఇప్పటికే విధించిన ఆంక్షలు, నిబంధన ప్రకారం క్రీడలను పూర్తి చేయాలని వివిధ దేశాల చెఫ్ డి మిషన్‌ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మొత్తం క్రీడాంశాలు: 33
పాల్గొంటున్న ఆటగాళ్ల సంఖ్య: 11,500
పోటీల వేదికలు : 42
అందుబాటులో ఉన్న స్వర్ణ పతకాలు : 339
25 మందితో భారత బృందం
ఆర్భాటాలు, అట్టహాసాలు ఏమీ లేకుండా ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా తక్కువ మందితో ఆరంభ వేడుకలు సాదాసీదాగా నిర్వహించనున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోయినా వివిధ దేశాల మార్చ్‌పాస్ట్ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో కూడా అన్ని దేశాలు తక్కువ మందితోనే పాల్గొంటున్నాయి. జపాన్ దేశ అక్షరమాల ప్రకారం వరుసలో 21వ స్థానంలో భారత బృందం నడుస్తుంది. మన దేశం నుంచి మార్చ్‌పాస్ట్‌లో 20 మంది ఆటగాళ్లు, 5 మంది అధికారులు నడుస్తారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వెల్లడించింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్, భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ‘ఫ్లాగ్ బేరర్స్’గా ముందుండి నడిపిస్తారు.
ప్రేక్షకుల్లేకుండానే...
మైదానంలో అభిమానుల చప్పట్లు, ప్రోత్సాహాలే అథ్లెట్లకు అదనపు ప్రాణవాయువునందిస్తాయి. ప్రేక్షకుల జోష్ మధ్య ఆటలు ఆడితే ఆ మజాయే వేరు. కానీ టోక్యోలో ఆటగాళ్లకు ఆ అదృష్టం లేదు. కరోనా నేపథ్యంలో ఈ క్రీడలకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. జూలై 12 నుంచి జపాన్‌లో అత్యయిక పరిస్థితిని విధించడంతో ప్రజ లకు ఆటలను చూసేందుకు ఎలాంటి అవకాశం లేదు. ఇక అభిమానులంతా తమ హీరోల ఆట చూసేందుకు ఇంట్లో టీవీలు, ఫోన్‌లకు పరిమితం కావాల్సిందే.
‘రియో’లో భారత్
గత క్రీడల్లో భారత్ రెండు పతకాలు మాత్రమే గెలిచి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తెలుగు పీవీ సింధు రజత పతకం గెలుచుకోగా... మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (58 కేజీల విభాగం)లో హరియాణాకు చెందిన సాక్షి మలిక్ కాంస్య పతకం సాధించింది.
9 స్వర్ణాలు, 7 రజతాలు, 12 కాంస్యాలు... ఒలింపిక్ క్రీడల చరిత్రలో మన దేశం సాధించిన మొత్తం పతకాల సంఖ్య 28... ఇందులో 8 పసిడి పతకాలు ఒక్క హాకీలోనే రాగా... ఇప్పటి వరకు ఒకే ఒక వ్యక్తిగత స్వర్ణం భారత్ ఖాతాలో ఉంది. నాలుగేళ్లకు ఒకసారి భారీ బలగంతో, ఆకాశాన్ని తాకే అంచనాలతో మన బృందం వెళుతున్నా... చాలా వరకు ఈ క్రీడలు నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు కూడా 127 మంది సభ్యులతో టీమిండియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2012లో గరిష్టంగా సాధించిన 6 పతకాల సంఖ్యను అధిగమిస్తుందా... రెండంకెల సంఖ్యను చేరుతుందా అనేది ఆసక్తికరం! ఇక ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా అమెరికా మొత్తం 2,847 పతకాలు గెలిచింది. ఇందులో 1,134 స్వర్ణాలు... 914 రజతాలు... 799 కాంస్యాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment