సాక్షి, వెబ్‌డెస్క్: కోట్లాది భారతీయుల గుండె గొంతుక టోక్యో వేదికగా మరొకసారి ఘనంగా వినిపించేనా?, ఒలింపిక్స్ విలేజ్‌లో సింధూరనాదం మళ్లీ ధ్వనించేనా?, యావత్ భారతావని చేత జైహింద్ అనిపిస్తూ పతక గడపలోకి అడుగుపెట్టేనా?, ఇదంతా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురించే సగటు క్రీడాభిమనాలో చర్చ. టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు సెమీస్‌కు చేరిన తర్వాత అభిమానుల్లో మరోసారి ఆసక్తిని పెంచిన సందర్భం ఇది.
రియోలో జరిగిన గత ఒలింపిక్స్‌లో రజతం సాధించి భారత కీర్తిని రెట్టింపు చేసిన పీవీ సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజా టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు 21-13, 22-20 ఆతిథ్య దేశమైన జపాన్ స్టార్ షట్లర్ యామగూచిని తేడాతో ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుని పతకానికి అడుగు దూరంలో నిలిచింది. నేడు(శనివారం) జరుగనున్న సెమీ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ తైజూయింగ్(చైనీస్ తైపీ)తో పోరుకు సన్నద్ధమైంది.
కచ్చితమైన క్రాస్‌కోర్టు షాట్స్
యామగూచితో జరిగిన క్వార్టర్ ఫైనల్లో తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో తన అనుభవాన్ని ఉపయోగించి రేసులో నిలిచింది. తొలి గేమ్ గురించి పెద్దగా చెప్పకోవాల్సిన అవసరం లేకపోయినా, రెండో గేమ్ మాత్రం ఆత్యంత ఆసక్తికరమనే చెప్పాలి. రెండో గేమ్‌లో ఆరంభం నుంచి సింధు ఆధిక్యం కనబరిచినప్పటికీ ఒకానొక దశలో వెనకబడిపోయింది. రెండో గేమ్‌లో 11-6తో ముందంజ వేసిన సింధు.. ఆపై దాన్ని 14-8 కి పెంచుకుంది. కానీ అప్పుడే అసలు సిసలు సమరం మొదలైంది.
యామగూచి పదునైన స్మాష్‌లతో సింధుపై ఒత్తిడి తెచ్చింది. ఆ క్రమంలోనే ఒక్కో పాయింట్ గెలుస్తూ సింధును సమీపించింది. అదే ఊపులో 18-16 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిపోయింది యామగూచి. వరుస 12 పాయింట్లలో 10 పాయింట్లు సాధించి సింధును వెనక్కి నెట్టింది యామగూచి. అదే ఊపులో గేమ్ పాయింట్‌కు చేరువైంది. అవతల యామగూచికి ఒక పాయింట్ వస్తే ఆమె రేసులో నిలుస్తుంది. ఆ దశలో సింధు తనలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. కచ్చితమైన క్రాస్‌కోర్టు షాట్స్‌తో యామగూచి ఆటకట్టించింది. ఆ పాయింట్‌ను బ్రేక్ చేయడమే కాకుండా వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుని సెమీస్‌కు అర్హత సాధించింది.
ప్రత్యర్థి వరల్డ్‌నంబర్‌వన్.. కానీ
పీవీ సింధుకు సెమీఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్ తైజుయింగ్‌ను ఎదుర్కొంటుంది. ఇప్పటివరకూ వీరిద్దరి ముఖాముఖి పోరులో సింధు 5-13 తేడాతొ వెనుకబడి ఉంది. కానీ ఇప్పటివరకు తైజుయింగ్ ఖాతాలో ఒక్క ఒలింపిక్స్ పతకం కూడా లేదు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న తైజుయింగ్ కనీసం క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరలేదు. మరి సింధుకు ఇప్పటికే ఒలింపిక్ మెడల్ తన ఖాతాలో ఉండటంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది సింధు. ఈ పోరులో ఓటమి పాలైన వారికి మరొక అవకాశం ఉండటం ఊరట కల్గించే అంశం. ఇందులో గెలిచిన వారు ఫైనల్‌కు వెళితే, ఓడిన వారు మాత్రం క్యాంస్య పతక పోరులో తలపడతారు.
అప్పుడు కూడా సింధునే
గత ఒలింపిక్స్‌లో తైజుయింగ్.. సింధు చేతిలో ఓడిపోయింది. అప్పుడు కూడా తైజుయింగ్ ర్యాంకింగ్.. సింధు కంటే ఎంతో మెరుగ్గా ఉంది. కానీ సింధు ఆ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో తైజుయింగ్ ఆటకట్టించింది. ఆనాటి ప్రీక్వార్టర్స్‌లో సింధు 21-13, 21-15 తేడాతో తైజుయింగ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. మరి ఈసారి ఇద్దరు సెమీస్‌లో పోరుకు సన్నద్ధమయ్యారు. వీరిద్దరూ ఎంతో శ్రమిస్తే కానీ సెమీస్‌కు రాలేకపోయారు. ప్రధానంగా తైజుయింగ్ ఓటమి దశ నుంచి తేరుకుని సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇక సింధు కూడా క్వార్టర్స్ రెండో గేమ్‌లో తడబడినా చివరకు సెమీస్‌కు చేరింది. టెక్నిక్ పరంగా ఇద్దరూ క్రీడాకారిణులు మెరుగ్గా ఉండటంతో ఆసక్తికర పోరు తప్పకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment