సింధు ఆట పతకం బాట పట్టింది. భారత స్టార్ షట్లర్ టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక్కడ అడుగు ముందుకు పడితే స్వర్ణం లేదా రజతం ఖాయమవుతుంది. ఓడితే మాత్రం కాంస్యం కోసం తలపడాల్సి వస్తుంది. సింధు ఉన్న ఫామ్‌ను చూస్తే ఆమె రాకెట్ ఆగేలా కనిపించడం లేదు. ప్రత్యరి్థని హడలెత్తిస్తూ దూసుకెళుతోంది. ఈసారి కచ్చితంగా పతకం రంగు మారేలా అనిపిస్తోంది.
టోక్యో: ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ రన్నరప్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ‘టోక్యో’లోనూ దూసుకెళుతోంది. ఓ అడుగు పడితే పాత పతకం ఖాయమవుతుంది. మరో అడుగు పడితే మాత్రం రంగే కాదు... ఏకంగా చరిత్రే లిఖిస్తుంది. మహిళల సింగిల్స్‌లో ఈ తెలుగు తేజం సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సింధు 56 నిమిషాల్లో 21–13, 22–20తో నాలుగో సీడ్ అకానె యామగుచిని కంగుతినిపించింది. సింధు సాధికారిక ఆటతీరుకు ‘పక్కా లోకల్ ఫేవరెట్’ అకానె యామగుచి వద్ద సరైన సమాధానం కరువైంది.
రెండో గేమ్‌లో హోరాహోరీ...
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు ఆట సూపర్. ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌ను మొదలుపెట్టింది. తొలి గేమ్‌ను చకచకా ముగించింది. ఆరంభంలో 2–4తో వెనుకబడినా... వెంటనే 6–6తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత గేమ్‌లో సింధు దూకుడు అంతకంతకూ పెరిగింది. క్రాస్ కోర్ట్ షాట్లతో, స్మాష్‌లతో 11–7తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో ప్రత్యర్థి చేసిన అనవసర తప్పిదాలు సింధుకు కలిసొచ్చాయి. ఇలా గేమ్ ముగిసేందుకు కూడా ఎంతోసేపు పట్టలేదు. 23 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇదే జోరుతో రెండు సూపర్ స్మాష్‌లతో రెండో గేమ్‌లో సింధు 2–0తో టచ్‌లోకి వచ్చింది. అయితే గేమ్ సాగేకొద్దీ పోటీ పెరిగింది. సుదీర్ఘ ర్యాలీల్లో యామగుచి పైచేయి సాధించడంతో ఆట హోరాహోరీగా సాగింది. 54 స్ట్రోక్‌లతో సాగిన ర్యాలీని యామగుచి గెలవడం, సింధు నీరసించడం భారత శిబిరంలో కాస్త కలవరపెట్టింది.
అయితే వెంటనే జాగ్రత్త పడిన సింధు కూడా నెట్ వద్ద దూకుడు పెంచింది. ఆఖర్లో స్మాష్‌లకు పదును పెట్టింది. స్కోరు 20–20 వద్ద ఉండగా మరో స్మాష్ సింధును ముందుకు తీసుకెళ్లగా... యామగుచి నెట్‌కేసి కొట్టిన షాట్ జపాన్ ప్రత్యరి్థని ముంచేసింది. యామగుచితో ఇప్పటి వరకు 19 మ్యాచ్‌ల్లో తలపడిన సింధు తాజా విజయంతో 12 సార్లు గెలుపొందింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో హీ బింగ్‌జియావో (చైనా) 13–21, 21–13, 21–14తో ఒకుహారా (జపాన్)పై, యు ఫె చెన్ (చైనా) 21–18, 21–19తో ఆన్ సియంగ్ (దక్షిణ కొరియా)పై, తై జు యింగ్ 14–21, 21–18, 21–18తో ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించారు.
అసలు సవాల్ నేడు...
భారత స్టార్‌కు నేడు అసలైన పోరాటం ఎదురుకానుంది. ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)ను సింధు ఢీకొట్టనుంది. ఓ విధంగా ఈ షట్లర్ మన తెలుగమ్మాయికి కొరకరాని కొయ్య. ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో ఓడించింది. ఓవరాల్‌గా పైచేయి కూడా ప్రత్యర్థిదే! సింధుపై తై జు గెలుపోటముల రికార్డు 13–7గా ఉండటం భారత బ్యాడ్మింటన్ స్టార్‌కు మింగుడు పడని అంశం. పైగా విశ్వక్రీడల సెమీస్ మ్యాచ్ కావడంతో ఒత్తిడంతా సింధుపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగమ్మాయి తన అస్త్రశ్రస్తాలకు పదునుపెడితే సరిపోదు... ప్రత్యర్థి లోటుపాట్లపై కన్నేసి ఆడితేనే సింధు మళ్లీ పసిడి పోరులో నిలుస్తుంది.
తొలి గేమ్ మొత్తం నా నియంత్రణలోనే సాగింది. నేనెక్కడా అలసత్వం ప్రదర్శించలేదు. తొలుత వెనుకబడినా కూడా యామగూచి గత మ్యాచ్‌ల్లో గెలిచిన తీరు నాకు బాగా తెలుసు. రెండో గేమ్‌లో మొదట నేను ఆధిక్యంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థి పుంజుకుంది. దీంతో నేనూ శక్తినంత కూడదీసుకొని పోరాడాను. ఎక్కడా ఆశలు వదులుకోలేదు. ఆఖరి దాకా అదేపనిగా శ్రమించాను. పొరపాట్లకు తావివ్వకుండా కోచ్ సూచనలు పాటించాను. అందుకే యామగుచి గేమ్ పాయింట్ వద్ద ఉన్నా ఆందోళన చెందకుండా కోచ్ చెప్పినట్లే చేశాను. చివరకు ఆశించిన ఫలితం దక్కడం చాలా సంతోషంగా ఉంది.
–పీవీ సింధు
Comments
Please login to add a commentAdd a comment